Tata Motors: టాటా మోటార్స్‌ నికర లాభం రూ.3,783 కోట్లు

Tata Motors: సెమీకండక్టర్ల సరఫరా క్రమంగా మెరుగవుతున్న నేపథ్యంలో కంపెనీ తయారీ, విక్రయాలు పుంజుకుంటున్నట్లు టాటా మోటార్స్‌ తెలిపింది. ఈ నేపథ్యంలోనే బలమైన ఫలితాలను నమోదు చేసినట్లు వివరించింది.

Updated : 02 Nov 2023 17:27 IST

దిల్లీ: దేశీయ ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్‌ సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాల (Tata Motors Q2 Results)ను గురువారం ప్రకటించింది. సమీక్షా త్రైమాసికంలో రూ.3,783 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. ఏడాది క్రితం ఇదే కాలంలో రూ.1,004 కోట్ల ఏకీకృత నికర నష్టాన్ని నివేదించింది. కార్యకలాపాల ద్వారా ఏకీకృత ఆదాయం వార్షిక ప్రాతిపదికన సెప్టెంబర్‌ త్రైమాసికంలో రూ.79,611 కోట్ల నుంచి రూ.1,05,128 కోట్లకు పెరిగింది.

టాటా మోటార్స్ (Tata Motors) ప్రయాణికుల వాహన విక్రయాలు సెప్టెంబరుతో ముగిసిన మూడు నెలల వ్యవధిలో వార్షిక ప్రాతిపదికన 2.4 శాతం పడిపోయి 1.39 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి. అదే సమయంలో వాణిజ్య వాహన అమ్మకాలు 3.5 శాతం పెరిగి 1.04 లక్షల యూనిట్లకు చేరాయి. కంపెనీ అనుబంధ జాగ్వార్‌ ల్యాండ్‌రోవర్‌ విక్రయాలు 29 శాతం పెరిగి 96,817 యూనిట్లకు చేరాయి. సెమీకండక్టర్ల సరఫరా క్రమంగా మెరుగవుతున్న నేపథ్యంలోనే కంపెనీ తయారీ, విక్రయాలు పుంజుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలోనూ కంపెనీ బలమైన ఫలితాలను నమోదు చేస్తుందని పేర్కొంది. జేఎల్‌ఆర్‌ వద్ద బలమైన ఆర్డర్‌ బుక్‌ ఉందని.. హెవీ ట్రక్కులకు గిరాకీ పుంజుకుంటోందని తెలిపింది. అలాగే ప్రయాణికుల వాహన విభాగంలో కొత్త కార్లకు ఆదరణ పెరుగుతోందని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని