Tech Mahindra: టెక్‌ మహీంద్రా నికర లాభంలో 61% క్షీణత.. ఒక్కో షేరుపై రూ.12 డివిడెండ్‌

Tech Mahindra | టెక్‌ మహీంద్రా నికర లాభం గణనీయంగా తగ్గింది. సెప్టెంబర్‌ త్రైమాసికంలో కంపెనీ లాభంలో 61 శాతం క్షీణత నమోదైంది. అలాగే ఒక్కో షేరుపై కంపెనీ రూ.12 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది.

Published : 25 Oct 2023 18:02 IST

Tech Mahindra Q2 Results | దిల్లీ: ఐటీ దిగ్గజం టెక్‌ మహీంద్రా (Tech Mahindra) సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాలను బుధవారం ప్రకటించింది. వార్షిక ప్రాతిపదికన ఏకీకృత నికర లాభం 61 శాతం తగ్గి రూ.505.3 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.1,299.2 కోట్లుగా కంపెనీ నివేదించింది. కార్యకలాపాల ద్వారా సంస్థ ఏకీకృత ఆదాయం రెండు శాతం కుంగి రూ.13,129.5 కోట్ల నుంచి రూ.12,864 కోట్లకు చేరింది. రూ.5 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రూ.12 మధ్యంతర డివిడెండ్‌ (Interim dividend) చెల్లించాలని కంపెనీ నిర్ణయించింది. దీనికి రికార్డు తేదీని 2023 నవంబర్‌ 2 గా నిర్ణయించింది. నవంబర్‌ 21న డివిడెండ్‌ చెల్లించనున్నట్లు తెలిపింది.

మరోవైపు ఈరోజు జరిగిన బోర్డు సమావేశంలో టెక్‌ మహీంద్రా (Tech Mahindra) మరో కీలక నిర్ణయం తీసుకుంది. మూడు అనుబంధ సంస్థలను టెక్‌ మహీంద్రాలో విలీనం చేయనున్నట్లు తెలిపింది. పెరిగోర్డ్ ప్రీమీడియా ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, పెరిగోర్డ్‌ డేటా సొల్యూషన్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, టెక్‌ మహీంద్రా సిరియం ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీల విలీన పథకాన్ని ఈరోజు బోర్డు ఆమోదించినట్లు వెల్లడించింది. ఫలితంగా ఈ మూడు కంపెనీల అప్పులు, ఆస్తులు టెక్‌ మహీంద్రా (Tech Mahindra)కు బదిలీ అవుతాయని పేర్కొంది. ఈ విలీన పథకానికి నియంత్రణా సంస్థల అనుమతులు లభించాల్సి ఉందని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని