Tesla-Reliance: భారత్‌లోకి టెస్లా ఎంట్రీ.. రిలయన్స్‌తో మస్క్‌ చర్చలు?

Tesla-Reliance: భారత్‌లో తయారీ ప్లాంటు ఏర్పాటు కోసం రిలయన్స్‌తో టెస్లా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

Updated : 10 Apr 2024 14:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌లోకి టెస్లా (Tesla) ప్రవేశంపై గతకొన్నేళ్లుగా చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంపై తాజాగా ఓ ఆసక్తికర అప్‌డేట్‌ వచ్చింది. దేశంలో తయారీ కేంద్రం ఏర్పాటు నిమిత్తం ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌తో (RIL) టెస్లా చర్చలు జరపుతున్నట్లు సమాచారం. ఈ మేరకు ఓ జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటు ప్రతిపాదనను ముందుకు తెచ్చినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులను ఉటంకిస్తూ హిందూ బిజినెస్‌లైన్‌ ఓ కథనం ప్రచురించింది. 

ఈ కథనంలోని వివరాల ప్రకారం.. దాదాపు నెలరోజులుగా రెండు కంపెనీల ప్రతినిధుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఇవి ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయి. అయితే, వాహన తయారీలోకి రిలయన్స్‌ (RIL) ప్రవేశిస్తున్నట్లుగా ఈ పరిణామాన్ని భావించొద్దని సదరు వర్గాలు వెల్లడించాయి. విద్యుత్తు వాహన తయారీ, విక్రయాలు సహా ఇతర అనుబంధ సేవలను మాత్రమే కంపెనీ సమకూర్చనున్నట్లు తెలిపాయి.

భారత్‌లో టెస్లా (Tesla) ప్రవేశంపై కంపెనీ అధిపతి ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) కీలక వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే తాజా అప్‌డేట్‌ రావడం గమనార్హం. అత్యధిక జనాభా ఉన్న దేశాల్లో విద్యుత్తు కార్ల వినియోగం అవసరమని ఎక్స్‌ వేదికగా మంగళవారం మస్క్‌ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో టెస్లా కార్ల ప్రవేశం విషయంలో ‘సహజమైన పురోగతి’ కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.

తయారీ కేంద్రం ఏర్పాటుకు అవసరమైన స్థలం కోసం టెస్లా వివిధ రాష్ట్రప్రభుత్వాలను సంప్రదించినట్లు ఇటీవల పలు జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. మహారాష్ట్ర, గుజరాత్‌ ఆకర్షణీయ ప్రతిపాదనలను వారి ముందుంచినట్లు సమాచారం. తెలంగాణ ప్రభుత్వంతోనూ చర్చలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. దాదాపు 2-3 బిలియన్‌ డాలర్ల వరకు పెట్టుబడి పెట్టొచ్చని సమాచారం. 

మరోవైపు కుడివైపు స్టీరింగ్‌ ఉండే కార్ల తయారీని జర్మనీలో ఉన్న టెస్లా (Tesla) ప్లాంటులో ప్రారంభించినట్లు రాయిటార్స్ వెల్లడించింది. బహుశా వీటిని భారత మార్కెట్‌కు ఎగుమతి చేసే అవకాశం ఉందని పేర్కొంది. ఏప్రిల్‌లో కంపెనీ ప్రతినిధుల బృందం భారత్‌లో పర్యటించి తయారీ కేంద్రానికి అవసరమైన స్థలాన్ని ఎంపిక చేయనున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని