Tesla entry to India: భారత్‌లోకి టెస్లా ఎంట్రీ.. వయా బెర్లిన్‌ రూట్‌!

Eenadu icon
By Business News Team Published : 20 Feb 2025 14:07 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

Tesla entry to India | ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ సంస్థ టెస్లా (Tesla) భారత మార్కెట్లోకి ప్రవేశించడం దాదాపు ఖరారైంది. ప్రపంచంలోని వివిధ దేశాల్లో కార్లు తయారుచేస్తున్న ఆ సంస్థ.. భారత్‌లో ప్లాంట్‌ను నెలకొల్పుతుందా? లేదా? అనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సిఉంది. తొలుత దిగుమతి చేసిన మోడళ్లను దేశీయంగా విక్రయించాలని ఆ కంపెనీ భావిస్తోంది. వీటిని పొరుగునున్న చైనా నుంచి కాకుండా జర్మనీ రాజధాని బెర్లిన్‌లోని తమ అతిపెద్ద గిగా ఫ్యాక్టరీ నుంచి దిగుమతి చేసే అవకాశం ఉంది.

విద్యుత్‌ కార్ల దిగుమతికి సంబంధించి గతేడాది మార్చిలో భారత ప్రభుత్వం కొత్త ఈవీ పాలసీని తీసుకొచ్చింది. దీనికింద రూ.4,150 కోట్ల పెట్టుబడికి హామీ ఇచ్చి 15 శాతం సుంకంతో ఏటా 8 వేల వాహనాలను దిగుమతి చేసుకోవచ్చు. దేశీయంగా తయారీలో స్థానికంగా ముడిసరకు సమకూర్చుకోవాలన్న నిబంధన కూడా ఉంది. ఈ పాలసీని వినియోగించుకొని భారత్‌లోకి ఎంట్రీ ఇవ్వాలని టెస్లా భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు నిన్న మొన్నటివరకు దేశీయంగా మస్క్‌ విద్యుత్‌ కార్ల తయారీ ప్లాంట్‌ నెలకొల్పకపోవచ్చన్న ఊహాగానాలు వినిపించాయి. కానీ, తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంపే స్వయంగా భారత్‌లో టెస్లా ప్లాంట్‌ ఏర్పాటు గురించి ప్రస్తావించడంతో అలాంటిదేమీ లేదని తేలింది.

అమెరికాలో తయారైన కార్లకు లెఫ్ట్‌హ్యాండ్‌ డ్రైవింగ్‌ ఉంటుంది. మన దేశంలో రైట్‌ హ్యాండ్‌ డ్రైవింగ్‌ ఉంటుంది. పొరుగునున్న చైనాలో పెద్దఎత్తున రైట్‌ హ్యాండ్‌ డ్రైవింగ్‌ మోడళ్లను టెస్లా ఉత్పత్తి చేస్తోంది. అయితే, చైనాతో ఉన్న వివాదాల దృష్ట్యా డ్రాగన్‌ దేశం నుంచి దిగుమతుల విషయంలో టెస్లాకు భారత్‌ అభ్యంతరం తెలిపినట్లు తెలిసింది. దీంతో జర్మనీలోని బెర్లిన్‌ ఫ్యాక్టరీ నుంచి రైట్‌ హ్యాండ్‌ డ్రైవింగ్‌ కార్లను భారత్‌కు తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది. ఇక్కడ టెస్లా వై మోడళ్లు తయారవుతున్నాయి. వీటినే భారత్‌కు తేనున్నారు. మరోవైపు ప్లాంట్‌ ఏర్పాటు విషయంలో గుజరాత్‌, మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాలు ప్రధానంగా పోటీ పడుతున్నాయి. ఏపీ, తెలంగాణ కూడా ఈ రేసులో ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని