Tesla: చైనాలో మళ్లీ తగ్గిన టెస్లా కార్ల ధరలు.. కారణాలివే..!

Tesla: అమెరికాలో ఇటీవలే టెస్లా తమ కార్ల ధరలను తగ్గించింది. తాజాగా చైనాలోనూ కుదిస్తున్నట్లు ప్రకటించింది. ఎంత మేర తగ్గించింది? అందుకు కారణాలేంటో చూద్దాం..!

Published : 22 Apr 2024 00:03 IST

Tesla | బీజింగ్‌: చైనాలో తమ విద్యుత్తు కార్ల ధరలన్నింటినీ టెస్లా తగ్గించింది. అప్‌డేటెడ్‌ మోడల్‌ 3 ధరను 14,000 యువాన్లు తగ్గించి 2,31,000 యువాన్లు చేసింది. మోడల్‌ వై ధర 2,49,000 యువాన్లు , మోడల్‌ ఎస్‌ ధర 6,84,900 యువాన్లు, మోడల్‌ ఎస్‌ ప్లెయిడ్‌ ధరను 8,14,900 యువాన్లకు కుదించింది. ఇటీవల అమెరికాలోనూ వివిధ మోడళ్ల ధరను టెస్లా (Tesla) తగ్గించింది. (1 యువాన్‌ దాదాపు రూ.11.70కు సమానం).

రెగ్యులర్‌ మోడల్‌ ఎక్స్‌ ధర ప్రస్తుతం చైనాలో 7,24,900 యువాన్లకు చేరింది. దీంట్లో ప్లెయిడ్‌ వేరియంట్‌ ధర రూ.8,24,900గా ఉంది. అలాగే బీమా ప్రీమియం రాయితీ వంటి ప్రత్యేక ప్రోత్సాహకాలను కూడా జత చేసింది. బీవైడీ వంటి చైనా బడా కంపెనీల నుంచి టెస్లా (Tesla)కు తీవ్ర పోటీ ఎదురవుతోంది. మరోవైపు ఇటీవల గిరాకీ కూడా గణనీయంగా పడిపోయింది. ఈ నేపథ్యంలోనే కస్టమర్లను ఆకట్టుకునేందుకు టెస్లా ధరలను తగ్గించాలని నిర్ణయించింది. జనవరిలోనూ మోడల్‌ 3, వై ధరలను కుదించింది. ‘మోడల్‌ వై’పై ఫిబ్రవరిలో రాయితీ ప్రకటించింది.

చైనాలో టెస్లాకు (Tesla) గట్టి పోటీనిస్తున్న బీవైడీ సైతం ఫిబ్రవరిలో కొన్ని మోడళ్ల కార్లపై భారీ రాయితీ ప్రకటించింది. ‘సాంగ్‌ ప్రో హైబ్రిడ్‌’ ఎస్‌యూవీ ప్రారంభ ధరను 15 శాతం మేర కుదించింది. డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో టెస్లాను అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద విద్యుత్తు కార్ల తయారీ సంస్థగా బీవైడీ అవతరించింది.

అమెరికా సహా వివిధ మార్కెట్లలో ఖరీదైన కార్లపై వెచ్చించడానికి కస్టమర్లు వెనుకాడుతున్నారు. అధిక వడ్డీరేట్లే దీనికి కారణం. దీంతో టెస్లా (Tesla).. పాత కార్లను పెద్దగా అప్‌గ్రేడ్‌ చేయడం లేదు. అదే సమయంలో చైనాలో వివిధ కంపెనీలు అందుబాటు ధరలో కొత్త మోడళ్లను ప్రవేశపెడుతున్నాయి. విక్రయాలు కుంగడం, పోటీ పెరగడంతో టెస్లా వ్యయ నియంత్రణ చర్యలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఇటీవలే 10 శాతం ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది.

టెస్లా భారత ఎంట్రీ దిశగా అడుగులు పడుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాదిలోనే మన దేశంలో విక్రయాలు ప్రారంభించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. దిల్లీ, ముంబయిలలో విక్రయ కేంద్రాల ఏర్పాటు కోసం ఇప్పటికే స్థలాలను పరిశీలించినట్లు సమాచారం. జర్మనీలోని ప్లాంట్‌లో, భారతీయులకు తగ్గట్లుగా కుడి చేతి వైపు స్టీరింగ్‌ ఉండే కార్లను టెస్లా ఉత్పత్తి చేస్తోంది. దేశంలో ప్లాంటు ఏర్పాటుకూ సుముఖత చూపుతున్న కంపెనీ.. అది సిద్ధమయ్యేలోగా జర్మనీ నుంచి దిగుమతి చేసుకోనున్నట్లు సమాచారం. మరోవైపు సంస్థ సీఈఓ ఎలాన్‌ మస్క్‌ ఈ నెల 21, 22 తేదీల్లో భారత్‌లో పర్యటించాల్సి ఉండగా.. చివరి నిమిషంలో అది వాయిదా పడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని