Tesla Car: ఫ్యాక్టరీ టు ఓనర్‌.. సెల్ఫ్ డ్రైవ్‌ చేసుకుంటూ యజమానికి ఇంటికి చేరిన టెస్లా కారు

Eenadu icon
By Business News Team Updated : 30 Jun 2025 07:08 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్న పూర్తిస్థాయి సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కారు వచ్చేసింది. అమెరికాకు చెందిన ఆటోమోటివ్‌, క్లీన్ ఎనర్జీ దిగ్గజం టెస్లా మొట్టమొదటి  సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కారు జర్నీ వీడియోను పంచుకుంది. అసలు మానవ నియంత్రణ లేకుండా ఫ్యాక్టరీ నుంచి నేరుగా యజమాని ఇంటికి కారు డెలివరీ అయింది. ‘టెస్లా మోడల్‌ వై’ పేరుతో తీసుకొచ్చిన ఈ కారు కేవలం 30 నిమిషాల్లోనే హైవేలు, ట్రాఫిక్‌ సిగ్నళ్లు దాటుకుంటూ ప్రయాణించింది. ఇందుకు సంబంధించిన వీడియోను కంపెనీ ఎక్స్‌లో పోస్ట్‌ చేయగా, ప్రస్తుతం అది వైరల్ అవుతోంది. ఫ్యాక్టరీ నుంచి బయలుదేరిన కారు.. రహదారిపై ఉన్న పరిస్థితులకు అనుగుణంగా వేగాన్ని నియంత్రించుకుంటూ దారిలో ఎదురయ్యే మలుపులు, ట్రాఫిక్‌ సిగ్నళ్లు, పక్క నుంచి వెళ్లే ఇతర వాహనాలను సమన్వయం చేసుకుంటూ వెళ్లింది. యజమాని ఇంటికి చేరాక స్వయంగా పార్కింగ్‌ ప్రదేశానికి వెళ్లి నిలిచింది.

ఈ మేరకు టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. టెస్లా టీమ్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ కారు లోపల ఎవరూ లేరు. బయట నుంచి కూడా ఎవరు ఆపరేట్‌ చేయలేదు. ఇది పూర్తిగా ఆటోమేటిక్‌ ప్రయాణం. డ్రైవర్‌ లేకుండా, రిమోట్‌తో ఆపరేట్‌ చేయకుండా రహదారులపై జరిగిన మొట్టమొదటి ప్రయాణం కూడా ఇదే కావొచ్చు’ అని మస్క్‌ పేర్కొన్నారు.

కారు దాదాపు గంటకు 115 కిలోమీటర్ల వేగాన్ని సైతం అందుకుందని టెస్లా ఏఐ సాఫ్ట్‌వేర్ వైస్ ప్రెసిడెంట్‌ అశోక్‌ ఎల్లుస్వామి వెల్లడించారు. ఆస్టిన్‌లో జూన్‌ 22న టెస్లా తన రోబోట్యాక్సీ పరీక్షలను ప్రారంభించింది. ఆ సమయంలో కొందరు ఇన్‌ఫ్లూయెన్సర్లకు ఈ మోడల్‌ వై సెల్ఫ్‌డ్రైవింగ్‌ కారులో ప్రయాణించే అవకాశం కల్పించింది. భవిష్యత్తులో లక్షల సంఖ్యలో రోబోట్యాక్సీలను అందుబాటులోకి తేవాలని టెస్లా లక్ష్యంగా పెట్టుకుంది.


Tags :
Published : 30 Jun 2025 00:06 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని