PropEquity: రూ.60 లక్షల్లోపు ఇళ్ల నిర్మాణం తగ్గుతోంది

అందుబాటు ధర (రూ.60 లక్షల వరకు) కొత్త ఇళ్ల సరఫరా దేశంలోని 8 ప్రధాన నగరాల్లో ఈ ఏడాది జనవరి-మార్చిలో 38% తగ్గిందని స్థిరాస్తి డేటా అనలిటిక్‌ సంస్థ ప్రాప్‌ఈక్విటీ తెలిపింది.

Published : 27 May 2024 03:08 IST

రూ.60 లక్షల్లోపు ఇళ్ల నిర్మాణం తగ్గుతోంది
జనవరి-మార్చిలో 38% క్షీణత: ప్రాప్‌ఈక్విటీ

దిల్లీ: అందుబాటు ధర (రూ.60 లక్షల వరకు) కొత్త ఇళ్ల సరఫరా దేశంలోని 8 ప్రధాన నగరాల్లో ఈ ఏడాది జనవరి-మార్చిలో 38% తగ్గిందని స్థిరాస్తి డేటా అనలిటిక్‌ సంస్థ ప్రాప్‌ఈక్విటీ తెలిపింది. బిల్డర్లు పెద్ద, విలాసవంత ఫ్లాట్లను నిర్మించడంపై అధికంగా దృష్టి సారిస్తున్నారని వివరించింది. సమీక్షా త్రైమాసికంలో రూ.60 లక్షల్లోపు ఇళ్లు/ఫ్లాట్లు 33,420 కు పరిమితమయ్యాయని పేర్కొంది. 2023 ఇదే సమయంలో వీటి సరఫరా 53,818 యూనిట్లుగా ఉంది. భూముల ధరలు-నిర్మాణ వ్యయాలు పెరగడంతో అందుబాటు ధర నివాస ప్రాజెక్టుల వల్ల తక్కువ లాభాలు వస్తున్నాయని బిల్డర్లు చెబుతున్నారని వివరించింది. దిల్లీ-ఎన్‌సీఆర్, ముంబయి మెట్రోపాలిటన్‌ రీజియన్‌ (ఎంఎంఆర్‌), బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా, పుణె, అహ్మదాబాద్‌ల్లో వివరాలు సేకరించి ఈ నివేదిక రూపొందించినట్లు ప్రాప్‌ఈక్విటీ పేర్కొంది. దిల్లీ, రాజధాని ప్రాంతంలో మాత్రమే అందుబాటు ధర ఇళ్ల సరఫరా, ఏడాది క్రితం కంటే పెరిగింది. ః 2022తో పోలిస్తే 2023లో రూ.60 లక్షల్లోపు ఇళ్ల సరఫరా 20% తగ్గింది. గతేడాది ఈ విభాగంలో 1,79,103 కొత్త ఇళ్లు అందుబాటులోకి వచ్చాయి. 2022లో ఇవి 2,24,141గా నమోదయ్యాయని ప్రాప్‌ఈక్విటీ ఎండీ, సీఈఓ సమీర్‌ జసుజా వెల్లడించారు. 2024లోనూ అందుబాటు ధర ఇళ్ల సంఖ్య మరింత తగ్గొచ్చని అంచనా వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు