Crisil: ఇళ్లకు డిమాండ్‌.. సిమెంట్‌కు అదే హుషార్‌

సమీప భవిష్యత్తులో మన దేశంలో సిమెంట్‌ తలసరి వినియోగం గణనీయంగా పెరుగుతుందని క్రిసిల్‌ అంచనా వేసింది. ప్రస్తుతం మనదేశంలో తలసరి సిమెంటు వినియోగం 240- 250 కిలోలుగా ఉంది.

Published : 09 Jun 2024 03:33 IST

తయారీ సామర్థ్యం పెంపునకు కంపెనీల సన్నాహాలు
ఈనాడు - హైదరాబాద్‌

మీప భవిష్యత్తులో మన దేశంలో సిమెంట్‌ తలసరి వినియోగం గణనీయంగా పెరుగుతుందని క్రిసిల్‌ అంచనా వేసింది. ప్రస్తుతం మనదేశంలో తలసరి సిమెంటు వినియోగం 240- 250 కిలోలుగా ఉంది. ఇది ప్రపంచ సగటు కంటే ఎంతో తక్కువ. ప్రపంచ దేశాల సగటు 500-550 కిలోలుగా ఉంది. మనదేశంలో జనాభా 2050 నాటికి 166 కోట్లకు చేరుతుందని అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తున్నాయి. దీనివల్ల పట్టణాలు, నగరాల్లో ఇళ్లకు తీవ్రమైన కొరత ఏర్పడుతుంది. ఇప్పటికే  పట్టణాల్లో దాదాపు 2 కోట్ల ఇళ్ల కొరత ఉన్నట్లు అంచనా. 2030 నాటికి ఇది రెట్టింపు కావచ్చు. దీనికి పరిష్కారంగా ప్రభుత్వాలు ఇళ్ల నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లో సిమెంటు వినియోగం పెరుగుతుంది. 2025 వరకు సిమెంటుకు డిమాండ్‌ ఏటా 8- 9% పెరిగే అవకాశం ఉన్నట్లు క్రిసిల్‌ అంచనా వేసింది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని, సిమెంటు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడం, సామర్థ్యాన్ని అధికంగా వినియోగించుకోవడానికి సిమెంటు కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన సాగర్‌ సిమెంట్స్‌ కూడా ఇదే పంథాలో ముందుకెళ్తోంది. ఆంధ్రా సిమెంట్స్‌ను కొనుగోలు చేయడం వల్ల ఈ సంస్థకు 2.25 మిలియన్‌ టన్నుల సామర్థ్యం లభించింది. ఆంధ్రా సిమెంట్స్‌ యూనిట్లో ఆధునికీకరణ, విస్తరణ చేపట్టినట్లు సాగర్‌ సిమెంట్స్‌ పేర్కొంది. దీని కోసం రూ.470 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు వెల్లడించింది. కాలుష్యాన్ని తగ్గించేందుకు సాగర్‌ సిమెంట్స్‌కు చెందిన మట్టంపల్లి యూనిట్‌తో పాటు ఆంధ్రా సిమెంట్స్‌కు చెందిన దాచేపల్లి యూనిట్లో విద్యుత్తు లోడర్లు, ఈవీ ట్రక్కులు వినియోగిస్తున్నట్లు పేర్కొంది.


2035కు 20 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి 

సాగర్‌ సిమెంట్స్‌ లక్ష్యం
అమ్మకాలు పెరుగుతాయని ఆశాభావం 

సాగర్‌ సిమెంట్స్‌ 2035 కల్లా 20 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యాన్ని సమకూర్చుకోవాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ సంస్థ, దక్షిణాది రాష్ట్రాల్లో క్రియాశీలక సిమెంట్‌ కంపెనీల్లో ఒకటిగా ఉంది. కొంతకాలంగా తూర్పు, మధ్య భారతదేశ రాష్ట్రాలపై దృష్టి సారించింది. ఈ సంస్థకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో సిమెంటు యూనిట్లు ఉన్నాయి. కొద్దికాలం క్రితమే సాగర్‌ సిమెంట్స్‌ 10 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించింది. ప్రస్తుతం ఈ సంస్థకు 10.5 మిలియన్‌ టన్నుల వార్షిక సిమెంటు ఉత్పత్తి సామర్థ్యం ఉంది. 2035 నాటికి ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలనేది తమ లక్ష్యమని సాగర్‌ సిమెంట్స్‌ జాయింట్‌ ఎండీ ఎస్‌.శ్రీకాంత్‌రెడ్డి సంస్థ వార్షిక నివేదికలో పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థ ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.2,504 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఎబిటా (వడ్డీ, పన్ను, తరుగుదల, ఇతర కేటాయింపుల కంటే ముందు ఆదాయం) రూ.245 కోట్లు ఉంది. అదే సమయంలో రూ.52 కోట్ల నికర నష్టం నమోదైంది. తన ఉత్పత్తి సామర్థ్యంలో 53 శాతాన్ని సంస్థ వినియోగించుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు