Sebi: డెరివేటివ్స్‌లో స్థానం.. కంపెనీలకు ఇకపై కష్టమే

స్టాక్‌మార్కెట్లోని డెరివేటివ్స్‌ (ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌- ఎఫ్‌అండ్‌ఓ) విభాగంలో ట్రేడ్‌ అయ్యే కంపెనీల జాబితాలోకి కొత్త కంపెనీల ప్రవేశం ఇకపై కష్టంగా మారనుంది. దీనికి సంబంధించి నియమ నిబంధనలను కఠినతరం చేయాలని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ప్రతిపాదించింది.

Updated : 11 Jun 2024 02:04 IST

అర్హత నిబంధనలు కఠినతరం చేయనున్న సెబీ
చర్చాపత్రం విడుదల
సాధారణ మదుపరులకు రక్షణ కల్పించటమే లక్ష్యం 

దిల్లీ: స్టాక్‌మార్కెట్లోని డెరివేటివ్స్‌ (ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌- ఎఫ్‌అండ్‌ఓ) విభాగంలో ట్రేడ్‌ అయ్యే కంపెనీల జాబితాలోకి కొత్త కంపెనీల ప్రవేశం ఇకపై కష్టంగా మారనుంది. దీనికి సంబంధించి నియమ నిబంధనలను కఠినతరం చేయాలని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ప్రతిపాదించింది. అంతగా సత్తా లేని చిన్నా, చితకా కంపెనీలను డెరివేటివ్స్‌ జాబితా నుంచి తొలగించే అవకాశం ఇందువల్ల ఏర్పడనుంది. నగదు విభాగంలో ట్రేడింగ్‌ వాల్యూమ్‌ అధికంగా నమోదయ్యే కంపెనీలే ఎఫ్‌అండ్‌ఓ విభాగంలోకి ప్రవేశించేందుకు అనుమతి ఇస్తారు. ‘మార్కెట్‌ హెచ్చుతగ్గులు, మోసపూరిత ఆలోచనలు ఉన్న వ్యక్తుల చర్యల వల్ల సాధారణ మదుపరులు డెరవేటివ్స్‌ విభాగంలో నష్టాల పాలయ్యే ప్రమాదం ఉంది. వారికి తగినంత రక్షణ కల్పించడం తప్పనిసరి’ అని సెబీ ఈ సందర్భంగా వివరించింది. అత్యంత నాణ్యమైన కంపెనీల షేర్లను, వాటిలో నమోదయ్యే ట్రేడింగ్‌ పరిమాణం, ఇతర అంశాల ఆధారంగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని పేర్కొంది. దీనికి తగ్గట్లుగా డెరివేటివ్స్‌ విభాగంలో మార్పులు తీసుకురానున్నట్లు స్పష్టం చేసింది. 

ప్రస్తుత నిబంధనలు 2018 నుంచి..

 డెరివేటివ్స్‌ విభాగంలో స్థానం పొందేందుకు కంపెనీలకు అర్హత, సంబంధిత విధివిధానాలను 2018లో నిర్దేశించారు. ఆ తర్వాత వీటిని సమీక్షించలేదు. గత కొన్నేళ్లలో నగదు విభాగంలో, ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌లో ట్రేడింగ్‌ వాల్యూమ్‌ గణనీయంగా పెరిగింది. సంస్థాగత మదుపరులకు తోడు, సాధారణ మదుపరులు సైతం ఎఫ్‌అండ్‌ఓలో అధికంగా ట్రేడ్‌ చేస్తున్నారు. తగిన అవగాహన లేకుండానే ట్రేడింగ్‌ చేసి నష్టపోతున్న మదుపరుల సంఖ్య భారీగా పెరిగినందునే, నిబంధనలను కట్టుదిట్టం చేయాలని సెబీ సంకల్పించింది. 

మార్పులు ఇలా

సెబీ ప్రతిపాదనల ప్రకారం, డెరివేటివ్స్‌ విభాగంలోకి ఏదైనా కంపెనీని చేర్చాలంటే,  ట్రేడింగ్‌ జరిగే మొత్తం రోజుల్లో కనీసం 75% రోజుల పాటు సంబంధిత కంపెనీ షేర్లలో ట్రేడింగ్‌ నమోదు కావాలి.  కనీసం 200 మంది ట్రేడర్లు కానీ, స్టాక్‌మార్కెట్లో  చురుకుగా షేర్ల క్రయవిక్రయాలు సాగించే ట్రేడర్లలో కనీసం 15% మంది కానీ... సంబంధిత షేరులో క్రయవిక్రయాలు సాగించాలి. ఈ రెండింటిలో ఏది తక్కువగా ఉంటే, దాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. రోజువారీ ట్రేడింగ్‌ విలువ రూ.500-1500 కోట్ల మధ్య ఉండాలి. రోజు వారీ డెరివేటివ్స్‌ ప్రీమియమ్‌ టర్నోవర్‌ కనీసం రూ.150 కోట్లు ఉండాలి. ఈ నిబంధనలతో సరితూగిన కంపెనీలకే, డెరివేటివ్స్‌ విభాగంలో అడుగు పెట్టే అవకాశం ఏర్పడుతంది. 

ఓపెన్‌ కాంట్రాక్టులకూ

ఓపెన్‌ కాంట్రాక్టులకూ గరిష్ఠ పరిమితిని సెబీ నిర్దేశించింది. ప్రస్తుతం ఓపెన్‌ కాంట్రాక్టుల విలువ రూ.500 కోట్లు కాగా, దీనిని రూ. 1250 కోట్లు, రూ.1750 కోట్లకు పెంచాలని ప్రతిపాదించారు. తగినంత ట్రేడింగ్‌ టర్నోవర్, ఓపెన్‌ ఇంట్రస్ట్, ఎక్కువ మంది భాగస్వామ్యం... ప్రధాన లక్ష్యాలుగా ఈ నిబంధనలను సెబీ ప్రతిపాదించింది. ఒక షేరుకు మీడియన్‌ క్వార్టర్‌- సిగ్మా ఆర్డర్‌ సైజు ప్రస్తుతం కనీసం రూ.25 లక్షలు కాగా, దీన్ని రూ.75 లక్షల నుంచి రూ.1 కోటికి మధ్య ఉంచాలని నిర్దేశించారు. నగదు మార్కెట్లో గత 6 నెలల్లో ఒక షేరుకు ప్రతి రోజూ కనీస రోలింగ్‌ యావరేజ్‌ డెలివరీ విలువ పరిమితిని ప్రస్తుత రూ.10 కోట్ల నుంచి రూ.30- 40 కోట్లకు పెంచాలని ప్రతిపాదించారు. డెరివేటివ్స్‌ విభాగంలో ఇప్పుడున్న ఏదైనా కంపెనీ షేరు వరుసగా 3 నెలల పాటు ఈ నియమ నిబంధనలకు అనుగుణంగా లేనిపక్షంలో, ఆ షేరును డెరివేటివ్స్‌ విభాగం నుంచి తొలగిస్తారు. ఆ తర్వాత దానిపై ఎఫ్‌అండ్‌ఓ ట్రేడింగ్‌ ఉండదు.. కేవలం నగదు మార్కెట్లో మాత్రమే లావాదేవీలు నిర్వహించడం సాధ్యపడుతుంది. 

 ఈ ప్రతిపాదనలపై అభిప్రాయాలను సెబీ ఆహ్వానించింది. ఈ నెల 19 వరకు వచ్చిన అభిప్రాయాలను పరిశీలించాక, కొత్త నిబంధనలను ఖరారు చేస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని