TRAI rule: నెలకు ₹20తో మీ సిమ్‌ యాక్టివ్‌.. ఈ ట్రాయ్‌ రూల్‌ తెలుసా?

Eenadu icon
By Business News Team Updated : 21 Jan 2025 14:41 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

Trai rule | ఇంటర్నెట్‌ డెస్క్‌: మనలో చాలామంది రెండేసి సిమ్‌లు వాడుతుంటారు. ఒకప్పుడు విరివిగా వాడినా.. టెలికాం ఛార్జీలు పెరిగిన నేపథ్యంలో రెండో సిమ్‌కార్డు వాడే వారి సంఖ్య తగ్గింది. దీంతో తమ రెండో సిమ్‌కార్డులను పక్కన పడేసిన వారెందరో. అలా ఎక్కువ రోజులు సిమ్‌కార్డును వాడకుండా వదిలేస్తే.. మీ పేరు రద్దయి వేరొకరికి చేరుతుంది. అలా కాకుండా అది మీ పేరు మీదే కొనసాగాలీ అనుకుంటే.. కేవలం రూ.20 రీఛార్జి చేసుకుంటే సరిపోతుంది. ట్రాయ్‌ తీసుకొచ్చిన ఈ నిబంధన.. ఎంతోమంది డ్యూయల్‌ సిమ్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌ అనే చెప్పాలి.

సిమ్‌కార్డును కాల్స్‌, ఎస్సెమ్మెస్‌లు, డేటా వాడకుండా ఎటువంటి యాక్టివ్‌ రీఛార్జి ప్లాన్‌ లేకుండా 90 రోజులకు మించి సిమ్‌ కార్డును పక్కన పడేస్తే అది డిస్‌కనెక్ట్‌ అయిపోతుంది. అప్పుడు మీ టెలికాం ఆపరేటర్‌ ఆ సిమ్‌కార్డును మీ పేరు నుంచి డీరిజిస్టర్‌ చేసి వేరొకరికి కేటయిస్తారు. ఇలా మీ పేరుమీదే సిమ్‌కార్డు కొనసాగాలంటే రూ.20 రీఛార్జి చేసుకుంటే సరిపోతుంది. మీరు 90 రోజుల పాటు మీ సిమ్‌కార్డును వాడకపోతే.. మీ ప్రీపెయిడ్‌ బ్యాలెన్స్‌ నుంచి రూ.20 కట్‌ అయ్యి మీకు 30 రోజుల గడువు లభిస్తుంది. ఇలా ప్రతి నెలా రూ.20తో రీఛార్జి చేసుకుంటే మీ సిమ్‌కార్డును యాక్టివ్‌గా ఉంచుకోవచ్చు. జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా, బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారులు ఈ సదుపాయం వినియోగించుకోవచ్చు.

ఒకవేళ ఆ నెలలో ఏదైనా కారణంతో మీ ఖాతాలో రూ.20తో రీఛార్జి చేసుకోకపోతే 15 రోజుల గ్రేస్‌ పీరియడ్‌ లభిస్తుంది. ఆలోపు మీ ఖాతాలో బ్యాలెన్స్ మెయింటెయిన్‌ చేసుకుంటే సరిపోతుంది. లేకపోతే మీ సిమ్‌కార్డును కోల్పోవాల్సి వస్తుంది. వాస్తవానికి ట్రాయ్ తీసుకొచ్చిన రూల్‌ కొత్తదేమీ కాదు. ఈ ఆటోమేటిక్‌ నంబర్‌ రిటెన్షన్‌ స్కీమ్‌ను ఎప్పుడి నుంచో ఉంది. దీనిపై సరైన ప్రచారం లేకపోవడంతో చాలా మంది రెండో సిమ్‌ను తమ పేరు మీద కొనసాగించేందుకు ప్రతినెల పెద్ద మొత్తం పెట్టి రీఛార్జి చేసుకుంటున్నారు. అదే పోస్ట్‌పెయిడ్‌ ఖాతాల విషయంలో అయితే 3 నెలలకు రూ.177 చెల్లించాల్సి ఉంటుందని నిబంధనలు చెబుతున్నాయి.

గమనిక: ఈ సదుపాయం కేవలం మీ సిమ్‌కార్డును మీ పేరు మీద యాక్టివ్‌గా ఉంచడానికి ఉద్దేశించిన రీఛార్జి మొత్తం మాత్రమే. ఆ నంబర్‌తో ఇన్‌కమింగ్‌, ఔట్‌ గోయింగ్‌ కాల్స్‌ చేసుకోవాలంటే మాత్రం.. ఆయా టెలికాం కంపెనీలు నిర్దేశించిన ప్లాన్ల ప్రకారం రీఛార్జి చేసుకోవాల్సి ఉంటుంది.

Tags :
Published : 21 Jan 2025 14:37 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని