చైనా ఈవీలు, లోహాలపై దిగుమతి సుంకాల పెంపు

చైనాలో తయారయ్యే విద్యుత్‌ వాహనాలు (ఈవీ), అత్యాధునిక బ్యాటరీలు, సోలార్‌ సెల్స్,  వైద్య సామగ్రితో పాటు అక్కడ నుంచి దిగుమతి అయ్యే ఉక్కు, అల్యూమినియంపై కొత్త టారిఫ్‌లు విధిస్తామని బైడెన్‌ ప్రభుత్వం ప్రకటించింది.

Published : 19 May 2024 01:47 IST

అమెరికా ప్రభుత్వ ప్రతిపాదన

వాషింగ్టన్‌: చైనాలో తయారయ్యే విద్యుత్‌ వాహనాలు (ఈవీ), అత్యాధునిక బ్యాటరీలు, సోలార్‌ సెల్స్,  వైద్య సామగ్రితో పాటు అక్కడ నుంచి దిగుమతి అయ్యే ఉక్కు, అల్యూమినియంపై కొత్త టారిఫ్‌లు విధిస్తామని బైడెన్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఎన్నికల ముందు అమెరికా తీసుకున్న ఈ చర్యతో ప్రపంచంలోనే రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన ఈ దేశాల మధ్య సంఘర్షణ పెరిగే అవకాశం కనిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ మధ్య ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న ఈ సమయంలో, ప్రభుత్వం తాజా నిర్ణయం వెలువడడం గమనార్హం. చైనాపై ఎవరు కఠినంగా వ్యవహరించగలరో నిరూపించుకోవడానికి బైడెన్‌ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

టారిఫ్‌ ఎంత?: చైనా ఈవీ దిగుమతులపై సుంకం 27.5 శాతంగా ఉండగా.. తాజా ప్రతిపాదనలతో ఈ ఏడాది 102.5 శాతానికి పెరుగుతుందని అంచనా. సోలార్‌ సెల్‌ దిగుమతులపై సుంకం రేటు రెట్టింపై 50 శాతానికి చేరుతుందంటున్నారు. 2025 కల్లా ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై సుంకం 25 శాతానికి, కంప్యూటర్‌ చిప్‌లపై టారిఫ్‌లు రెట్టింపై 50 శాతానికి చేరొచ్చు. లిథియం అయాన్‌ ఈవీ బ్యాటరీలపై సుంకం 2024లోనే 7.5% నుంచి 25 శాతానికి చేరొచ్చంటున్నారు. నాన్‌-ఈవీ బ్యాటరీలపై సుంకం పెంపును 2026లో అమలు చేస్తారు.

ప్రభావం ఎలా?: కొత్త టారిఫ్‌లపై చైనా ఎలా స్పందిస్తున్నది కీలకం. కొత్త టారిఫ్‌లు వచ్చే మూడేళ్లలో దశల వారీగా అమలు కానున్నాయి. ప్రస్తుతం అమెరికాలోకి ఈవీలు అతి స్వల్పంగానే దిగుమతి అవుతున్నాయి.  చైనా ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీల వల్ల, తక్కువ ధర (12,000 డాలర్లు) మోడళ్లు అమెరికా మార్కెట్‌ను ముంచెత్తుతాయోమోనని అమెరికా అధికారులు ఆందోళన చెందడం వల్లే, భారీగా దిగుమతి సుంకాలు పెంచారు. అయితే హరిత ఆర్థిక వ్యవస్థగా మారడానికి తమ తక్కువ ధర ఉత్పత్తులు ఉపయోగపడతాయని చైనా అధికారులు వాదిస్తున్నారు. ప్రపంచ గిరాకీని అందుకునే సామర్థ్యం తమ సోలార్‌ సెల్‌ ప్లాంట్లు, ఉక్కు, అల్యూమినియం మిల్లులకు ఉందన్నది వారి వాదన.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని