Crime: ఐదేళ్ల చిన్నారిపై హత్యాచారం.. పోలీసుల అదుపులో 20మంది అనుమానితులు

ఓ ఐదేళ్ల చిన్నారిపై పలువురు అత్యాచారానికి పాల్పడి, అనంతరం హత్య చేసిన ఘటన గోవాలోని వాస్కో ప్రాంతంలో చోటుచేసుకుంది.

Published : 13 Apr 2024 19:40 IST

పనాజీ: ఓ ఐదేళ్ల చిన్నారిపై పలువురు అత్యాచారానికి పాల్పడి, అనంతరం హత్య చేసిన ఘటన గోవాలోని వాస్కో ప్రాంతంలో చోటుచేసుకుంది. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (సౌత్) సునీతా సావంత్ తెలిపిన వివరాల ప్రకారం... గోవాలోని వాస్కోలో గురువారం సాయంత్రం నుంచి కనబడకుండా పోయిన ఐదేళ్ల బాలిక శుక్రవారం ఉదయం వడెమ్ ప్రాంతంలోని ఓ నిర్మాణస్థలంలో అపస్మారక స్థితిలో కనిపించింది. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, మార్గమధ్యలోనే ఆ చిన్నారి మరణించినట్లు వైద్యులు పేర్కొన్నారు.  కాగా పోస్టుమార్టం రిపోర్టులో బాలిక లైంగిక వేధింపులకు గురైనట్లు, చిన్నారిని గొంతు నులిమి చంపినట్లు వెల్లడైంది. రిపోర్టు ఆధారంగా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని ఎస్పీ తెలిపారు. 20 మంది అనుమానితులను, సమీపంలోని కూలీలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని పేర్కొన్నారు.

ఈ ఘటనకు సంబంధించి గోవా ప్రభుత్వానికి నోటీసులు జారీ చేశామని, త్వరలో సమగ్ర నివేదిక అందజేస్తామని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్‌సీపీసీఆర్) ఛైర్మన్ ప్రియాంక్ కనూంగో తెలిపారు. ‘‘దేశంలో పోక్సో చట్టం నిందితులపై కఠినంగానే ఉంటుంది. కానీ దానిని మరింత మెరుగ్గా అమలుచేయడం అవసరం. ఈ కేసుపై నివేదిక వెలువడిన అనంతరం తగిన చర్యలు తీసుకుంటాము’’ అని ఆయన తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని