ఘోరం: హోంవర్క్‌ చేయలేదని చితకబాదిన టీచర్‌.. ఏడేళ్ల బాలుడి మృతి

బిహార్‌లో అమానుష ఘటన వెలుగుచూసింది. ఏడేళ్ల చిన్నారిపై ఓ టీచర్‌ అత్యంత కర్కశంగా ప్రవర్తించాడు. హోంవర్క్‌ చేయలేదని చితకబాదడంతో ఆ చిన్నారి ప్రాణాలు విడిచాడు.

Published : 25 Mar 2023 21:15 IST

పట్నా: హోమ్‌వర్క్‌ చేయలేదని ఓ ఉపాధ్యాయుడు (Teacher) ఎల్‌కేజీ చదువుతున్న ఏడేళ్ల విద్యార్థిపై తన ప్రతాపాన్ని చూపించాడు. ఆ దెబ్బలను తట్టుకోలేని చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. బిహార్‌(Bihar)లోని ఓ ప్రైవేటు పాఠశాలలో చోటుచేసుకున్న ఈ విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

బిహార్‌లోని సహర్సా ప్రాంతానికి చెందిన ఏడేళ్ల ఆదిత్య యాదవ్‌ స్థానికంగా ఓ ప్రైవేట్‌ పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతూ అక్కడే వసతి గృహంలో ఉంటున్నాడు. ఇచ్చిన హోమ్‌వర్క్‌ చేయకపోవటం, చెప్పిన పాఠాలు వినటం లేదనే కారణంతో టీచర్‌ సుజిత్‌ కుమార్‌ గత బుధవారం చిన్నారిని కర్రతో తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనలో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. మరుసటి రోజు ఉదయం ఆదిత్య హాస్టల్‌లో మంచంపై అపస్మారక స్థితిలో పడి ఉండటం చూసిన తోటి విద్యార్థులు సుజిత్‌కు తెలియజేశారు.
దీంతో అతడిని ఆసుపత్రిలో చేర్చారు. అయితే అప్పటికే ఆ చిన్నారి మృతిచెందినట్లు అక్కడి వైద్యులు ధ్రువీకరించారు. దీంతో స్కూల్‌ యాజమాన్యం బాలుడి కుటుంబానికి సమాచారమిచ్చింది. పాఠాలు గుర్తుపెట్టుకోవటం లేదనే కారణంతో వరుసగా రెండు రోజులు ఆదిత్యను ఉపాధ్యాయుడు కొట్టారని దాంతో శరీరంపై వాపు వచ్చినట్లు అదే స్కూల్లో చదువుతున్న మరో బాలుడు తెలిపాడు.

‘హోలీ అనంతరం మార్చి 14న నా కుమారుడు హాస్టల్‌కు వచ్చాడు. ఆదిత్య హాస్టల్‌ నుంచి స్కూల్‌కి చేరుకోకముందే స్పృహ కోల్పోయాడని.. ఆసుపత్రికి తీసుకెళ్లే లోపల నా బిడ్డ మరణించాడని సుజిత్‌ సమాచారం అందించారు. కానీ, స్కూల్లో తీవ్రంగా కొట్టడం వల్లే నా కుమారుడు ప్రాణాలు కోల్పోయాడు’ అని బాలుడి తండ్రి ప్రకాశ్‌ యాదవ్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం సుజిత్‌ పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని