Crime News: ఎక్కాలు నేర్చుకోలేదని.. బాలుడిని తోటివిద్యార్థులతో గంటపాటు కొట్టించి..!

Crime News: చెప్పిన హోంవర్క్ పూర్తిచేయలేదని ఓ విద్యార్థితో టీచర్ వ్యవహరించిన తీరు విమర్శలకు దారితీసింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

Updated : 26 Aug 2023 17:24 IST

లఖ్‌నవూ: ఓ బాలుడిని తరగతిలోని తోటి విద్యార్థులతో కొట్టించారో ఓ ఉపాధ్యాయురాలు. ఎక్కాలు నేర్చుకోలేదని ఆ శిక్ష విధించారు. ఆ విద్యార్థిని శిక్షించిన వీడియో వైరల్‌ కావడంతో ఆ టీచర్‌(school teacher)పై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఉత్తర్‌ప్రదేశ్‌(Uttar Pradesh)లోని ముజఫర్‌నగర్‌(Muzaffarnagar)లో జరిగిన ఈ ఘటన రాజకీయంగానూ దుమారం రేపింది. 

ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోన్న దృశ్యాల ప్రకారం.. ఒకటో తరగతి చదువుతోన్న బాలుడు చెప్పిన హోం వర్క్‌ చేయలేదని టీచర్‌ తోటి విద్యార్థులతో  కొట్టించారు. మధ్యలో సెలవు వచ్చినా ఎక్కాలు నేర్చుకొని రాలేదని కోపగించుకుంటూ.. అతడిని గట్టిగా కొట్టాలని ఇతర విద్యార్థులకు చెప్పారు. ఈ ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడారు. 

అమ్మానాన్న క్షమించండి.. సూసైడ్ నోట్ రాసి బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

‘మా అబ్బాయికి ఏడు సంవత్సరాలు. మా కుమారుడిని టీచర్ పదేపదే కొట్టించారు. ఏదో పనిమీద పాఠశాలకు వచ్చిన మా బంధువు ఆ వీడియో తీశాడు. నా కుమారుడిని గంటపైగా వేధించారు’ అని వెల్లడించారు. ఈ వీడియో వైరల్‌ కావడంతో రాజకీయంగా తీవ్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి. దీనిపై పోలీసులు స్పందిస్తూ.. ఈ ఘటనపై ప్రిన్సిపల్‌తో మాట్లాడామని, ఆ టీచర్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. 

ఆ టీచర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘చదువు విషయంలో పిల్లాడితో కఠినంగా ఉండమని అతడి తల్లిదండ్రులే ఒత్తిడి చేసేవారు. నేను దివ్యాంగురాలిని కావడంతో ఇతర విద్యార్థులకు చెప్పి దెబ్బలు వేయించాను. ఆ చిన్నారి బంధువు తీసిన వీడియోను వక్రీకరించారు’ అని తన చర్యను సమర్థించుకున్నారు. ఇదిలా ఉంటే.. ఆ విద్యార్థి తల్లిదండ్రులు మొదట కేసు పెట్టడానికి నిరాకరించారని, కానీ ఈ రోజు ఉదయం స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని డిస్ట్రిక్‌ మేజిస్ట్రేట్  అరవింద్ బంగారీ వెల్లడించారు. ఆ పిల్లాడి గుర్తింపు వెల్లడయ్యేలా ఉన్న ఆ వీడియోను షేర్ చేయొద్దంటూ జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ప్రజల్ని కోరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని