Hyderabad: సీసీఎస్‌ ఏసీపీ ఉమామహేశ్వరరావు అరెస్ట్‌.. రూ.3కోట్లకు పైగా అక్రమాస్తులు?

ఆదాయానికి మించి ఆస్తులు కూటబెట్టారనే ఆరోపణలపై సీసీఎస్‌ ఏసీపీ ఉమామహేశ్వరరావును ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.

Updated : 21 May 2024 22:04 IST

హైదరాబాద్‌: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై సీసీఎస్‌ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇళ్లలో అనిశా అధికారుల సోదాలు ముగిశాయి. ఉదయం 5గంటల నుంచి 14 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. అశోక్‌నగర్‌లో ఉన్న ఆయన నివాసం, అదే అపార్ట్‌మెంట్లో ఉన్న మరో రెండు ఇళ్లు, సీసీఎస్‌ కార్యాలయం, నగరంలోని మరో ఇద్దరు స్నేహితుల ఇళ్లు, ఆంధ్రప్రదేశ్‌లో రెండు చోట్ల సోదాలు నిర్వహించారు.

ఉమామహేశ్వరరావు కొనుగోలు చేసిన 17 ప్రాపర్టీలను సీజ్‌ చేసినట్టు అధికారులు తెలిపారు. అక్రమాస్తుల విలువ దాదాపు రూ.3కోట్లకుపైగా ఉంటుందని అంచనా. ఘట్‌కేసర్‌లో 5, విశాఖ, చోడవరంలో ఏడు చోట్ల భూములు, హైదరాబాద్‌లో నాలుగు ఇళ్లు, శామీర్‌పేట్‌, కూకట్‌పల్లి, మల్కాజిగిరిలో భూములు కొనుగోలు చేసినట్టు గుర్తించారు. ఏసీపీ డైరీలో సందీప్‌ అనే పేరు ఉందని, అతను ఎవరనేది దర్యాప్తు చేస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. ఇబ్రహీంపట్నం ఏసీపీగా పనిచేసిన సమయంలో అక్రమార్జనతో భారీగా ఆస్తులు కూడబెట్టారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. మరో వైపు ప్రస్తుతం పనిచేస్తున్న సీసీఎస్‌లో పలు కేసుల్లో ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధితులకు న్యాయం చేయకుండా నిందితులకు మద్దతు పలుకుతున్నారని పలువురు సోదాలు జరుగుతున్న అతని నివాసం వద్దకు వచ్చి అధికారులకు మొరపెట్టుకున్నారు. సోదాల అనంతరం ఏసీపీ ఉమామహేశ్వరరావును అరెస్టు చేసినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం కోర్టులో హాజరు పర్చనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని