Paradip Port: ఒడిశా తీరంలో రూ.220 కోట్ల డ్రగ్స్‌ పట్టివేత!

ఒడిశా తీరంలో ఓ నౌకలో రూ.220 కోట్ల విలువ చేసే మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

Published : 01 Dec 2023 23:24 IST

భువనేశ్వర్‌: ఒడిశా తీరంలో భారీ ఎత్తున మాదకద్రవ్యాలు (Drugs) పట్టుబడ్డాయి. ఇక్కడి పారాదీప్‌ నౌకాశ్రయం (Paradip Port)లో లంగరు వేసిన ఓ నౌకలో రూ.220 కోట్ల విలువ చేసే కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. వారు వెల్లడించిన వివరాల ప్రకారం.. పనామాలో రిజిస్టర్‌ అయిన ఓ సరకు రవాణా నౌక (MV Debi) ఈజిప్టు నుంచి ఇండోనేషియా మీదుగా పారాదీప్‌ పోర్టుకు చేరుకుంది. ఇక్కడి నుంచి స్టీల్ ప్లేట్లతో అది డెన్మార్క్‌కు బయలుదేరాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఓడలోని క్రేన్‌లో 22 అనుమానాస్పద ప్యాకెట్లను గుర్తించిన ఆపరేటర్.. వాటిని పేలుడు పదార్థంగా భావించి అధికారులకు సమాచారం అందించాడు.

తుపాకీ గురిపెట్టి.. బ్యాంకులో ₹18 కోట్లు దోపిడీ

పరీక్షల అనంతరం అది కొకైన్‌గా నిర్ధారణ అయిందని అధికారులు చెప్పారు. ‘ఓడలోని క్రేన్ నుంచి 22 ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నాం. ప్రత్యేక కిట్‌ను ఉపయోగించి పరీక్షించిన తర్వాత అందులోని పదార్థం ‘కొకైన్‌’గా తేలింది. స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాల విలువ మార్కెట్‌లో రూ.200 కోట్ల నుంచి రూ.220 కోట్ల మధ్య ఉంటుంది’ అని రాష్ట్ర కస్టమ్స్ కమిషనర్ ఓ వార్తాసంస్థకు తెలిపారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదన్నారు. అయితే.. నౌకలోని వియత్నాంకు చెందిన సిబ్బందిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే ఓడలో జాగిలాల సాయంతో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని