Atiq Ahmed: తుర్కియే తుపాకులతో అతీక్‌ హత్య.. రెండ్రోజుల ముందే మాటు వేసి..!

గ్యాంగ్‌స్టర్‌ అతీక్‌ అహ్మద్‌, అతడి సోదరుడి హత్యకు అత్యాధునిక తుర్కియే ఆయుధాలు వాడినట్లు గుర్తించారు. పేద కుటుంబాల నుంచి వచ్చిన హంతకుల వద్దకు ఈ ఆయుధాలు ఎలా చేరాయన్న విషయంపై అధికారులు  విచారణ మొదలుపెట్టారు.

Updated : 17 Apr 2023 12:58 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ : ఉత్తరప్రదేశ్‌ గ్యాంగ్‌స్టర్‌, మాజీ ఎంపీ అతీక్‌ అహ్మద్‌(Atiq Ahmed), అతడి సోదరుడు అష్రాఫ్‌ అహ్మద్‌ను చంపిన నిందితులు అత్యాధునిక ఆయుధాలను వాడినట్లు పోలీసులు గుర్తించారు. హంతకులు తుర్కియేకు చెందిన ‘టిసాస్‌’ కంపెనీ తయారు చేసిన సెమీ-ఆటోమేటిక్‌ ఆయుధమైన ‘జిగాన’(Zigana) పిస్తోల్‌ను వాడినట్లు సమాచారం. తుర్కియేలో పాలిమర్‌ ఫ్రేమ్‌తో తయారైన తొలి పిస్తోల్‌ ఇదే. ఈ ఆయుధం ఖరీదు ఒక్కోటీ రూ.ఆరు లక్షలకు పైగా ఉంటుంది. అక్కడి సైన్యం, ప్రత్యేక దళాలు, ఇతర సెక్యూరిటీ ఏజెన్సీలు ఈ తుపాకులను వాడుతున్నాయి. భారత్‌లో వీటిపై నిషేధం ఉంది.

మరోవైపు పాకిస్థాన్‌ నుంచి వీటిని దేశంలోకి అక్రమంగా రవాణా చేస్తున్నారన్న అనుమానాలు ఉన్నాయి. ఈ తుర్కియే తుపాకులకు పాకిస్థాన్‌ నకళ్లను తయారు చేస్తోంది. ఇవి అసలు తుపాకులంత నాణ్యతతో ఉన్నా.. ధరలో మాత్రం చౌకగా లభిస్తుంటాయి. పాకిస్థాన్‌లో ‘గన్‌ వ్యాలీ’గా పేరున్న ‘దర్రా ఆదమ్‌ ఖేల్‌’  అనే ప్రాంతంలో దాదాపు 2,000 ఆయుధ షాపులు ఉన్నాయి. జిగాన తుపాకులు అత్యంత నమ్మకంగా పనిచేయడంతోపాటు.. మిగిలిన అధునాతన తుపాకుల కంటే తక్కువ ధరలో లభిస్తాయి. సాధారణంగా ఆయుధ నిపుణులకు మాత్రమే తెలిసే ఇటువంటి తుపాకులు అతీక్‌(Atiq Ahmed) సోదరుల హంతకులు వాడటం పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతోపాటు ఇంత ఖరీదైన తుపాకులు కొనేంత ఆర్థిక సామర్థ్యం కూడా వారికి లేదు. ఈ హంతకులు ముగ్గురూ పేద కుటంబాల నుంచి వచ్చిన వారే.

తెరపైకి గ్యాంగ్‌స్టర్‌ సుందర్‌ భాటి పేరు..

అతీక్‌ సోదరులను హత్య చేసిన హంతకుల్లో ఒకడైన సన్నీకి పశ్చిమ ఉత్తరప్రదేశ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్‌ సుందర్‌ భాటితో సంబంధాలున్నట్లు భావిస్తున్నారు. ఈ హత్యకు వాడిన జిగాన తుపాకులు సుందర్‌ నుంచే సన్నీకి చేరినట్లు అనుమానిస్తున్నారు. యూపీలో గౌతం బుద్ధా నగర్‌ జిల్లాలోని గంఘోలా గ్రామానికి చెందిన భాటిపై 60కిపైగా కేసులు ఉన్నాయి. ఓ హత్య కేసులో అతడు సోనభద్ర జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. ఏడాదిన్నర క్రితం సన్నీ, సుందర్‌ హమీర్‌పూర్‌ జైల్లో కలుసుకొన్నారు. అక్కడే వీరి పరిచయం పెరిగింది. సన్నీని భాటి తన గ్యాంగ్‌లో చేర్చుకొన్నాడు. ఆ గ్యాంగ్‌ వద్ద అత్యాధునిక ఆయుధాలున్నట్లు అనుమానాలున్నాయి. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత సన్నీ.. భాటి మనుషులతో టచ్‌లో ఉన్నాడు. భాటికి పంజాబ్‌లోని గ్యాంగ్‌స్టర్లు, ఆయుధ స్మగ్లర్లతో సంబంధాలున్నాయి. అయితే.. భాటికి అతీక్‌(Atiq Ahmed)కు పాత విరోధాలు ఉన్నట్లు బయటపడలేదు.

అతీక్‌(Atiq Ahmed), అష్రాఫ్‌ మృతదేహాల్లో 14 తూటాలు..

గ్యాంగ్‌స్టర్‌ అతీక్‌(Atiq Ahmed), అతడి సోదరుడు అష్రాఫ్‌ మృతదేహాలకు నిన్న పోస్టుమార్టం నిర్వహించారు. అతీక్‌ మృతదేహం నుంచి మొత్తం 9 తూటాలను వెలికి తీయగా.. అష్రాఫ్‌ మృతదేహం నుంచి 5 తూటాలను గుర్తించారు. అతీక్‌ను అతి దగ్గర నుంచి ఒక సారి తలపై కాల్చగా.. దాదాపు 8 సార్లు ఛాతిపై కాల్పులు జరిపినట్లు తేలింది. మరోవైప్‌ అష్రాఫ్‌ ముఖంపై రెండుసార్లు.. మిగిలిన రౌండ్లు శరీరంపై కాల్చినట్లు పోస్టుమార్టం రిపోర్టు పేర్కొంది.

హంతకులు రెండ్రోజుల ముందు నుంచి ప్రయాగ్‌రాజ్‌లోనే మాటు వేసి..

అతీక్‌, అష్రాఫ్‌ను హత్య చేసిన ముగ్గురు హంతకులు ప్రయాగ్‌రాజ్‌లోనే ఓ హోటల్‌లో ఘటనకు రెండ్రోజుల ముందు నుంచి బస చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ ముగ్గురు హంతకులకు పరిచయం ఎలా ఏర్పడింది? ఎప్పుడు కలుసుకొన్నారు? ఈ హత్యకు ప్లానింగ్‌ ఎన్నాళ్ల నుంచి చేస్తున్నారన్న విషయాలపై పోలీసుల విచారణ కొనసాగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని