Murder: చర్మాన్ని ఒలిచి.. దేహాన్ని ముక్కలుగా చేసి..

చికిత్స కోసం భారత్‌కు వచ్చి దారుణంగా హత్యకు గురైన బంగ్లాదేశ్‌ ఎంపీ మహమ్మద్‌ అన్వరుల్‌ అజీమ్‌ అన్వర్‌(56) కేసు కొత్తమలుపు తిరిగింది. ప్రణాళిక ప్రకారం ఓ మహిళ సహాయంతో ఆయనను వలపు వల(హనీట్రాప్‌)లోకి దింపి, గొంతునులిమి హతమార్చినట్లు తాజాగా కోల్‌కతా సీఐడీ పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.

Updated : 25 May 2024 06:10 IST

బంగ్లాదేశ్‌ ఎంపీ దారుణహత్య కేసులో కొత్త కోణం
స్నేహితుడే సూత్రధారిగా పోలీసుల నిర్ధారణ!
రూ.5 కోట్లు సుపారీ తీసుకున్నట్లు విచారణలో నిందితుల వెల్లడి

బంగ్లా ఎంపీ అన్వర్‌

కోల్‌కతా/ఢాకా: చికిత్స కోసం భారత్‌కు వచ్చి దారుణంగా హత్యకు గురైన బంగ్లాదేశ్‌ ఎంపీ మహమ్మద్‌ అన్వరుల్‌ అజీమ్‌ అన్వర్‌(56) కేసు కొత్తమలుపు తిరిగింది. ప్రణాళిక ప్రకారం ఓ మహిళ సహాయంతో ఆయనను వలపు వల(హనీట్రాప్‌)లోకి దింపి, గొంతునులిమి హతమార్చినట్లు తాజాగా కోల్‌కతా సీఐడీ పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఆ తర్వాత మృతదేహంపైన చర్మాన్ని ఒలిచి.. ఎవరూ గుర్తుపట్టకుండా ముక్కలు ముక్కలుగా నరికి, ప్లాస్టిక్‌ సంచుల్లో కుక్కేసి.. వివిధ ప్రదేశాల్లో విసిరేసినట్లు తేల్చారు. పడేసే ముందు కొన్ని శరీర భాగాలను ఫ్రిజ్‌లో భద్రపరిచినట్లు గుర్తించారు. ఈ కేసులో ఒక నిందితుడిగా భావిస్తున్న జిహాద్‌ హవల్దార్‌ను సీఐడీ అధికారులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌లోకి అక్రమంగా చొరబడిన అతడు.. పేరు మార్చుకొని గుట్టుగా ముంబయిలో నివసిస్తున్నాడు. ఎంపీని హత్య చేసేందుకు ప్రస్తుతం అమెరికాలో ఉన్న అతడి స్నేహితుడు అఖ్తరుజమాన్‌ కుట్ర పన్నినట్లు, అందుకు రూ.5 కోట్ల సుపారీ ఇచ్చినట్లు ఓ సీనియర్‌ పోలీసు అధికారి వెల్లడించారు. వ్యాపార సంబంధ లావాదేవీల్లో వచ్చిన తేడాలతోనే ఈ హత్య జరిగి ఉండవచ్చన్న వాదనా వినిపిస్తోంది. పథకాన్ని అమలు చేసేందుకు హవల్దార్‌ రెండు మూడు నెలల ముందే కోల్‌కతాకు చేరుకొన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు విచారణలో అతడు నేరం ఒప్పుకొన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ హత్యతో సంబంధం ఉన్న మరో ముగ్గురిని ఇదివరకే బంగ్లాదేశ్‌ పోలీసులు అరెస్టు చేయగా.. వారిని 8 రోజుల రిమాండ్‌కు అప్పగిస్తూ అక్కడి కోర్టు ఆదేశించింది.


అసలేం జరిగింది?

ఈ నెల 12న చికిత్స కోసం కోల్‌కతాకు వచ్చిన బంగ్లా ఎంపీ అన్వర్‌.. గోపాల్‌ బిస్వాస్‌ అనే వ్యక్తి ఇంట్లో బస చేశాడు. మర్నాడు ఉదయం ఆసుపత్రికని బయలుదేరి, రాత్రి భోజనానికి వస్తానని చెప్పాడు.  తిరిగి రాకపోవడంతో 18న బిస్వాస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదృశ్యం కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. అమెరికాలో ఉండే అఖ్తరుజమాన్‌ అద్దెకు తీసుకున్న కోల్‌కతా టౌన్‌హాల్‌ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లోకి ఇద్దరు పురుషులు, ఒక మహిళతో కలిసి వెళ్లిన అన్వర్‌.. తిరిగి వెనక్కి రాలేదు. కానీ, ఆయనతోపాటు లోపలకు వెళ్లిన వారు మాత్రం ఒక్కొక్కరుగా బయటకు వచ్చారు. ఈ క్రమంలో పోలీసులు ఆ అపార్ట్‌మెంట్‌కు చేరుకోగా.. అక్కడ వారికి రక్తపు మరకలు కనిపించాయి. ఫోరెన్సిక్‌ బృందాల సాయంతో మరిన్ని ఆధారాలు సేకరించారు. ఆ మహిళ.. అఖ్తరుజమాన్‌కు తెలిసిన వ్యక్తేనని, ఆమె సాయంతోనే వలపు వల విసిరి పక్కా పథకం ప్రకారం ఎంపీని స్నేహితుడే దారుణంగా హత్య చేయించినట్లు పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని