UP Double Murder: యూపీ చిన్నారి సోదరుల హత్య కేసులో లొంగిపోయిన మరో నిందితుడు..!

చిన్నారి సోదరుల హత్య కేసులో తనకు సంబంధం లేదని నిందితుడి సోదరుడు పేర్కొన్నాడు. అతడు ఒక వీడియో సందేశం విడుదల చేసి పోలీసులకు లొంగిపోయాడు. 

Published : 21 Mar 2024 13:46 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన యూపీ చిన్నారుల హత్య కేసులో రెండో నిందితుడు జావెద్‌ ఎట్టకేలకు పోలీసులకు దొరికాడు. తనకు ఈ ఘాతుకంతో ఎటువంటి సంబంధం లేదని ఒక వీడియో విడుదల చేశాడు. హత్య విషయం తెలిసిన తర్వాతే బుదాయ్‌ వచ్చానని.. కానీ, అక్కడి ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉండటంతో దిల్లీ పారిపోయినట్లు పేర్కొన్నాడు. నా సోదరుడు సాజిద్‌ హత్య చేసినట్లు తనకు సమాచారం ఇచ్చిన వారి కాల్‌ రికార్డింగ్‌లు కూడా ఉన్నాయని చెబుతున్నాడు. 

ఈ క్రమంలో లొంగిపోవడానికి అతడు బరేలీకి రాగా.. స్థానికులు గుర్తించి పట్టుకొన్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించారు. ‘‘నిందితుడు జావెద్‌ బరేలీలో పోలీసులకు లొంగిపోయాడు. అంతకు ముందే ఓ వీడియోను వైరల్‌ చేశాడు. అతడిని ప్రశ్నించేందుకు తీసుకొస్తున్నాం’’ అని బుదాయ్‌ ఎస్పీ అలోక్‌ ప్రియదర్శి పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి సాజిద్‌ తండ్రి, సోదరులను కూడా పోలీసులు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. 

చిన్నారుల శరీరాలపై 23 గాయాలు..

చిన్నారుల మృతదేహాలకు  పోస్ట్‌మార్టం పూర్తిఅయింది. వీరిలో ఆయుష్‌ శరీరంపై 14 కత్తి గాయాలు, అహాన్‌కు 9 అయినట్లు గుర్తించారు. ముఖ్యంగా మెడా, ఛాతి, వీపు, కాళ్లపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఇక సాజిద్‌ తూటాల గాయాలతో మరణించినట్లు పోస్టుమార్టం నివేదిక వచ్చింది. 

గర్భవతిగా ఉన్న తన భార్య ప్రసవ ఖర్చుల నిమిత్తం రూ.5,000 ఇవ్వాలంటూ నిందితుడు సాజిద్‌.. పరిచయస్తుడైన గుత్తేదారు వినోద్‌ ఇంటికి మంగళవారం సాయంత్రం వెళ్లాడు. ఆ మొత్తాన్ని అప్పుగా ఇచ్చేందుకు వినోద్‌ భార్య సంగీత అంగీకరించింది. ఆమె లోపలికి వెళ్లినప్పుడు ఇంట్లో ఆడుకుంటున్న ఆమె కుమారుడు ఆయుష్‌ (12)ను సాజిద్‌ మేడపైకి తీసుకువెళ్లి, కత్తితో పొడిచి చంపాడు. ఆయుష్‌ సోదరులు అహాన్‌(7), పీయూష్‌(6) అదే సమయంలో అక్కడికి రావడంతో వారిపైనా దాడి చేశాడు. వీరిలో అహాన్‌ కూడా ప్రాణాలు కోల్పోయాడు. పీయూష్‌ స్వల్ప గాయాలతో తప్పించుకొన్నాడు. దీంతో సాజిద్‌, అతడి సోదరుడు జావెద్‌ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఎదురుకాల్పుల్లో సాజిద్‌ మరణించాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని