Murder: భారాస కార్యకర్త హత్య

వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన భారాస కార్యకర్త బొడ్డు శ్రీధర్‌రెడ్డి (48) హత్యకు గురయ్యారు.

Published : 24 May 2024 06:16 IST

బొడ్డు శ్రీధర్‌ రెడ్డి

చిన్నంబావి, న్యూస్‌టుడే: వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన భారాస కార్యకర్త బొడ్డు శ్రీధర్‌రెడ్డి (48) హత్యకు గురయ్యారు. బుధవారం రాత్రి తన ఇంటి పక్కన మంచంపై నిద్రిస్తున్న సమయంలో ఆయనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి హత్య చేశారని కుటుంబ సభ్యులు తెలిపారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. క్లూస్‌ టీం సభ్యులు హత్య జరిగిన ప్రదేశంలో ఆధారాలు సేకరించారు. కొల్లాపూర్‌ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉంటూ భారాసలో క్రియాశీలక పాత్ర పోషిస్తుండటంతో రాజకీయంగా గిట్టని వారే హత్య చేయించి ఉంటారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వర్‌రావు తెలిపారు.

చిన్నంబావి నుంచి లక్ష్మీపల్లి వరకు ర్యాలీగా వెళ్తున్న మాజీ మంత్రి కేటీఆర్‌.
చిత్రంలో గువ్వల బాలరాజు, శ్రీనివాస్‌గౌడ్, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ తదితరులు

రాష్ట్రంలో ప్రతీకార పాలన: కేటీఆర్‌ 

కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో ప్రతీకార పాలన చేపడుతోందని భారాస రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ పేర్కొన్నారు. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామంలో హత్యకు గురైన భారాస కార్యకర్త శ్రీధర్‌రెడ్డి మృతదేహానికి నివాళులర్పించి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంతకుముందు చిన్నంబావి నుంచి లక్ష్మీపల్లి వరకు మృతదేహంతో చేపట్టిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో సహకరించని వారిపై కాంగ్రెస్‌ నాయకులు కక్షపూరితంగా వ్యవహరిస్తూ దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా కొల్లాపూర్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావు హత్యారాజకీయాలకు తెరలేపారని ఆరోపించారు. గత 5 నెలల్లోనే మంత్రి ప్రోద్బలంతో ఇద్దరు హత్యకు గురయ్యారని పేర్కొన్నారు. మంత్రిని వెంటనే క్యాబినెట్‌ నుంచి తొలగించాలని సీఎం రేవంత్‌ను డిమాండ్‌ చేశారు. వరుస హత్యలపై సిట్‌ లేదా న్యాయవిచారణ చేపట్టాలన్నారు. తమ పాలనలో ఎన్నడూ హత్యారాజకీయాలు జరగలేదన్నారు. రాష్ట్రంలో దాడుల సంస్కృతి కొనసాగితే అధికార పార్టీ నాయకుల ఇళ్లను ముట్టడించడానికి వెనకాడబోమని హెచ్చరించారు. హతుడి తండ్రి శేఖర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదులో మంత్రి జూపల్లి పేరును చేర్చకుండా పోలీసులు ఫిర్యాదుదారుడిపై ఒత్తిడి తీసుకొచ్చారని ఆరోపించారు. బాధిత కుటుంబాన్ని పార్టీ తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. ఆయన వెంట మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, పార్టీ నేతలు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్, అభిలాష్‌రావు ఉన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని