భద్రతా బలగాలపై మావోయిస్టుల దాడి.. సీఆర్‌పీఎఫ్‌ ఏఎస్సై మృతి

ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో సీఆర్‌పీఎఫ్‌ ఏఎస్సై మృతి చెందగా, ఒక జవాను తీవ్రంగా గాయపడ్డాడు.

Published : 17 Dec 2023 11:56 IST

రాయ్‌పుర్: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. సుక్మా జిల్లాలోని జగర్‌గుండ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బెద్రెలో జరుగుతున్న వారాంతపు సంతలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో సీఆర్‌పీఎఫ్‌ ఏఎస్సై సుధాకర్‌ రెడ్డి మరణించారు. రాము అనే మరో జవాను తీవ్రంగా గాయపడ్డారు. అతడిని మెరుగైన వైద్యం కోసం హెలికాప్టర్‌లో రాయ్‌పుర్‌ జిల్లా ఆసుపత్రికి తరలించారు.

ఆదివారం ఉదయం ఏడు గంటల సమయంలో సీఆర్‌పీఎఫ్‌, జిల్లా పోలీసులు, కోబ్రా బలగాలు కూబింగ్‌ చేపట్టాయి. ఈ క్రమంలో వారాంతపు సంత జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ పొంచిఉన్న మావోయిస్టులు ఒక్కసారిగా భద్రతా బలగాలపై కాల్పులు జరిపారని సుక్మా జిల్లా పోలీసులు తెలిపారు. ఈ దాడి అనంతరం నలుగురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. మావోయిస్టుల కోసం సీఆర్‌పీఎఫ్‌, జిల్లా పోలీసులు, కోబ్రా దళాలు ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయని తెలిపారు.

ఎన్‌ఐఏ మోస్ట్‌ వాంటెడ్‌ జాబితాలో తెలుగు రాష్ట్రాల యువకులు

గత మంగళవారం ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుక్మా జిల్లా సలాతోంగ్‌ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని మోహల్లమాన్‌పూర్‌ జిల్లా బొగిటాల గ్రామ పరిసరాల్లో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. దీనిలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. తాజాగా ఆదివారం ఉదయం భద్రతా బలగాలపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. పది రోజుల వ్యవధిలో ఇది మూడో దాడి కావడం గమనార్హం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని