Cyber Fraud: ఐఫోన్ ఆశ చూపి రూ.ఏడు లక్షలు కొట్టేశారు

ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన మెసేజ్‌ ఆధారంగా తక్కువ ధరకే ఐఫోన్ వస్తుందని ఆశపడిన ఓ యువ వ్యాపారవేత్త.. సైబర్‌ నేరగాళ్ల చేతిలో పెద్ద మొత్తంలో నగదు పోగొట్టుకున్నాడు. చివరికి చేసేదేంలేక పోలీసులను ఆశ్రయించాడు.

Published : 21 Jul 2023 17:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆన్‌లైన్ బహుమతుల పేరుతో ఉచితంగా వచ్చే వాటి కోసం ఆశపడితే.. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. దేశవ్యాప్తంగా వర్చువల్ నంబర్‌లను ఉపయోగించి జరుగుతున్న సైబర్‌ మోసాల పట్ల వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు, సైబర్‌ నిపుణులు సూచిస్తున్నారు. కానీ, కొందరు ఆశతో, మరికొందరు అవగాహన లోపంతో ఆర్థికంగా నష్టపోతున్నారు. ఇప్పటిదాకా వ్యాపారంలో పెట్టుబడికి అధిక లాభాలు, ఆన్‌లైన్‌ లక్కీడ్రాల పేరుతో మోసం చేసిన సైబర్‌ నేరగాళ్లు ఇప్పుడు కొత్త పంథా మోసానికి తెరలేపారు. విదేశాల్లోని ప్రముఖ కంపెనీల పేర్లు చెబుతూ.. యూజర్లను ఏమార్చి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. 

గుజరాత్‌ (Gujarat)లోని అహ్మదాబాద్‌ (Ahmedabad)లో ధన్‌ధూకా ప్రాంతానికి చెందిన విరాగ్ దోషి అనే ఒక యువ వ్యాపారవేత్తకు ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram)లో ఓ మెసేజ్‌ వచ్చింది. దుబాయ్‌లోని బడే భాయ్‌ అండ్ చోటే భాయ్‌ అనే ఎలక్ట్రానిక్ స్టోర్‌ లక్కీడ్రాలో ఐఫోన్‌ 14 గెలుచుకున్నారు. రూ. మూడు వేలు చెల్లిస్తే.. ఐఫోన్ 14ను కొరియర్‌ చేస్తాం’’ అనేది మెసేజ్‌ సారాంశం. రూ. 70 వేలు ఖరీదైన ఐఫోన్ 14 కేవలం రూ. 3 వేలకే లభిస్తుందనే ఆశతో ఆ మెసేజ్‌లో ఉన్న ఫోన్‌ నంబర్‌కు విరాగ్ యూపీఐ ద్వారా రూ. 3 వేల నగదు చెల్లించాడు. 

గ్రామ పంచాయతీ వింత నిబంధన.. అతిక్రమిస్తే ఐదు చెప్పు దెబ్బలు

తర్వాతి రోజు విరాగ్‌కు +92 కోడ్‌ ఉన్న నంబర్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. బడే భాయ్‌ అండ్ చోటే భాయ్‌ స్టోర్‌ నుంచి మాట్లాడుతున్నానని.. ఐఫోన్‌ 14తోపాటు అదనంగా స్మార్ట్‌వాచ్‌ కూడా పంపుతున్నట్లు తెలిపాడు. సూరత్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఇవి డెలివరీ అవుతాయని చెప్పాడు. ఈ మాటలను నమ్మిన విరాగ్‌కు మరుసటి రోజు సంజయ్‌ శర్మ అనే వ్యక్తి నుంచి ఫోన్ చేశాడు. సూరత్‌ ఎయిర్‌పోర్ట్‌లో డెలివరీ విభాగంలో పనిచేస్తున్నట్లు పరిచయం చేసుకున్నాడు. విరాగ్ పేరు మీద వచ్చిన పార్శిల్‌ను డెలివరీ చేయాలంటే రూ. 8,000 చెల్లించాలని డిమాండ్ చేశాడు. అతని మాటలను నమ్మి.. విరాగ్‌ నగదు బదిలీ చేశాడు. 

ఆ తర్వాత ఫోన్ చేసిన వ్యక్తిని తిరిగి సంప్రదించేందుకు ప్రయత్నించగా స్పందనలేదు. అనుమానంతో బ్యాంకు ఖాతాలను చెక్ చేయగా.. తన ఖాతా నుంచి రూ. 6.76 లక్షల నగదు విత్‌డ్రా అయినట్లు గుర్తించాడు. మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు వర్చువల్‌ నంబర్ల సాయంతో నిందితులు మోసానికి పాల్పడినట్లు గుర్తించారు. పూర్తి దర్యాప్తు చేసి త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ఇటీవలి కాలంలో ఇన్‌స్టాగ్రామ్‌ మెసేజ్‌ల ద్వారా జరుగుతున్న మోసాలు పెరుగుతున్నాయని, అపరిచిత వ్యక్తుల ఖాతాల నుంచి మెసేజ్‌లు వస్తే నమ్మి మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని