Vizag Kidnap case: ఎంపీ కుమారుడిని ఇంట్లో కట్టేసి కత్తితో బెదిరించారు: డీజీపీ

విశాఖపట్నం వైకాపా ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సతీమణి, కుమారుడు కిడ్నాప్‌ వివరాలను డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు.

Updated : 16 Jun 2023 18:20 IST

మంగళగిరి: విశాఖపట్నం వైకాపా ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సతీమణి, కుమారుడు కిడ్నాప్‌ వ్యవహారంలో నిందితులు రూ.1.75 కోట్ల నగదు వసూలు చేశారని డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి తెలిపారు. వారి నుంచి ఇప్పటివరకు రూ.86.5 లక్షలు రికవరీ చేశామన్నారు. కిడ్నాప్‌ ఘటనకు సంబంధించిన వివరాలను డీజీపీ మీడియా సమావేశంలో వెల్లడించారు. 

‘‘ముగ్గురు నిందితులు ఎంపీ కుమారుడి ఇంట్లోకి వెళ్లి బెదిరించారు. ఎంపీ కుమారుడు శరత్‌ను ఇంట్లో కట్టేసి కత్తితో బెదిరించారు. మరుసటి రోజున ఎంపీ భార్య జ్యోతిని కుమారుడు శరత్‌తో పిలిపించి ఆమెను కూడా కట్టేశారు. ఆడిటర్‌ జీవీ వస్తే ఆయన్ను కూడా కట్టేసి బెదిరించారు. ఎంపీ కుమారుడి ఇంట్లో ఉన్న రూ.15లక్షలు తీసుకున్నారు. మరో రూ.60 లక్షలు ఖాతా నుంచి బదిలీ చేయించుకున్నారు. జీవీని కొట్టి బెదిరించి రూ.కోటి వరకు తెప్పించుకున్నారు’’ అని డీజీపీ వివరించారు. 

ఇదీ చదవండి: విశాఖ ఎంపీ కుటుంబీకుల కిడ్నాప్‌

కిడ్నాప్‌ సమాచారం అందగానే పోలీసులు గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు. కిడ్నాపర్లు రుషికొండ ప్రాంతంలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందిందని చెప్పారు. అప్పటివరకు బాధితులను కిడ్నాపర్లు డబ్బులు డిమాండ్‌ చేస్తూ వచ్చారన్నారు. పోలీసులు వెంబడిస్తున్నట్లు తెలిసి ఎంపీ సతీమణి, కుమారుడు, అడిటర్‌ జీవీతో పాటు కారులో పరారయ్యేందుకు యత్నించారు. నిందితులు హేమంత్‌, రాజేశ్‌, సాయి ముగ్గురూ కలిసి కారులో తప్పించుకునేందుకు ప్రయత్నించగా.. పోలీసులు ఛేజ్‌ చేశారు. పద్మనాభం ప్రాంతంలో కిడ్నాపర్ల కారు మరమ్మతుకు గురవ్వడంతో కిడ్నాప్ చేసిన ముగ్గుర్నీ అక్కడే వదిలేసి పరారయ్యారని, పోలీసులు వారిని చాకచక్యంగా పట్టుకున్నారని డీజీపీ తెలిపారు. రాష్ట్రంలోని శాంతిభద్రతలు సరిగా లేవని వస్తోన్న వార్తలపైనా డీజీపీ స్పందించారు. ఈ నేరఘటనను శాంతిభద్రతలకు ముడిపెట్టడం సరికాదన్నారు. రాష్ట్రంలో గత నాలుగేళ్లలో నేరాలు తగ్గుముఖం పట్టాయని డీజీపీ వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని