Cyber Crime: కేంద్ర మాజీ మంత్రికి షాకిచ్చిన సైబర్ నేరగాళ్లు

సైబర్‌ నేరగాళ్లు రోజుకో కొత్త పంథాలో మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా కేంద్ర మాజీ మంత్రి ఖాతా నుంచి నగదు కొట్టేశారు.

Published : 10 Oct 2023 19:58 IST

చెన్నై: రోజుకో కొత్త పంథాలో ఆన్‌లైన్‌ మోసాలు జరుగుతున్నాయి. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఎవర్నీ సైబర్‌ నేరగాళ్లు విడిచిపెట్టడం లేదు. తాజాగా కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే ఎంపీ దయానిధి మారన్‌ (Dayanidhi Maran) వ్యక్తిగత బ్యాంకు ఖాతా నుంచి రూ. 99,999 నగదు కొట్టేశారు. దీనికి సంబంధించిన వివరాలను ఆయన తన సోషల్‌ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. డిజిటల్‌ ఇండియాలో వ్యక్తిగత సమాచారం సురక్షితంగా లేదని చెబుతూ ఆయన మోసం జరిగిన తీరును వివరించారు. ఓటీపీ అవసరం లేకుండా, తన వ్యక్తిగత మొబైల్‌కు ఎలాంటి పేమెంట్ లింక్‌ రాకుండా సైబర్‌ నేరగాళ్లు నగదు కొట్టేశారని ట్వీట్‌లో పేర్కొన్నారు. 

‘ఎక్కడికెళ్లినా బాంబుల మోతే..’ గాజాలో చిక్కుకున్న భారత కుటుంబం ఆవేదన

‘‘ఆదివారం నా వ్యక్తిగత బ్యాంకు ఖాతా నుంచి రూ.99,999 నగదును సైబర్‌ నేరగాళ్లు కొట్టేశారు. నా భార్య జాయింట్ ఖాతాదారుగా ఉన్న యాక్సిస్‌ బ్యాంకు అకౌంట్‌ నుంచి ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు బిల్‌ డెస్క్‌కు ఈ నగదు బదిలీ అయినట్లు విచారణలో గుర్తించారు. అయితే, నా ఫోన్ నంబర్‌కు ఎలాంటి ఓటీపీ, పేమెంట్‌ లింక్‌ రాలేదు. జాయింట్‌ ఖాతాదారుగా ఉన్న నా భార్య మొబైల్‌కు ఫోన్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు ఇన్‌కమ్‌ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌ నుంచి ఫోన్ చేస్తున్నామని నమ్మించి, నగదు లావాదేవీ గురించి విచారించారు. ఆ వెంటనే బ్యాంకు ఖాతానుంచి నగదు బదిలీ అయింది. దీంతో నేను నా బ్యాంకు ఖాతాను స్తంభింపజేశాను. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. నా వ్యక్తిగత వివరాలు (ఫోన్‌ నంబర్‌, మెయిల్‌ ఐడీ, బ్యాంకు ఖాతా నంబర్) సైబర్‌ నేరగాళ్ల చేతికి ఎలా వెళ్లాయి? సైబర్‌ దాడి చేసిన వాళ్లు ఈ సమాచారం సేకరించారా? అనే దానిపై స్పష్టత లేదు. డిజిటల్‌ లావాదేవీలు, సైబర్ మోసాల గురించి అవగాహన కలిగిన మా పరిస్థితే ఇలా ఉంటే.. సామాన్యుల పరిస్థితి ఏంటి? ’’అని ప్రశ్నించారు. 

ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వాలు, ప్రైవేట్‌ సంస్థలు పటిష్ఠ సైబర్‌ భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు. 2020 జనవరి నుంచి 2023 జూన్‌ వరకు జరిగిన సైబర్‌ నేరాల్లో 75 శాతం నగదు లావాదేవీలకు సంబంధించనవే ఉన్నాయని దయానిధి మారన్ తెలిపారు. ప్రజల వ్యక్తిగత డేటాకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని ట్వీట్‌లో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని