Indians in Gaza: ‘ఎక్కడికెళ్లినా బాంబుల మోతే..’ గాజాలో చిక్కుకున్న భారత కుటుంబం ఆవేదన

Indian Family in Gaza: ఇజ్రాయెల్‌ బాంబుల మోతతో దద్దరిల్లుతోన్న గాజాలో ఓ భారత కుటుంబం చిక్కుకుపోయింది. తమకు పారిపోయే అవకాశమే లేదని, తమను కాపాడాలని భారత ప్రభుత్వాన్ని ఆ కుటుంబం వేడుకుంటోంది.

Published : 10 Oct 2023 16:57 IST

(ఇజ్రాయెల్‌ వైమానిక దాడులతో గాజాలో ధ్వంసమైన భవనాలు)

ఇంటర్నెట్‌ డెస్క్‌: తమ దేశంలోకి చొరబడి నరమేధానికి పాల్పడిన హమాస్‌ (Hamas)పై ఇజ్రాయెల్‌ (Israel) భీకర ప్రతీకార దాడులకు దిగింది. గాజాలోని ఉగ్రవాదుల స్థావరాలపై యుద్ధ విమానాలతో విరుచుకుపడింది. దీంతో గాజా స్ట్రిప్‌ (Gaza Strip) బాంబుల మోతతో దద్దరిల్లుతోంది. ఇలాంటి భయానక పరిస్థితుల మధ్య బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న ఓ భారత కుటుంబం (Indian Family).. తమను కాపాడాలంటూ భారత ప్రభుత్వాన్ని వేడుకుంటోంది.

జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir)కు చెందిన లుబ్నా నజీర్‌ షాబూ గత కొన్నేళ్లుగా తన భర్త, కుమార్తెతో కలిసి గాజాలో నివసిస్తున్నారు. హమాస్‌పై ప్రతిదాడికి దిగిన ఇజ్రాయెల్‌.. గాజాను అష్టదిగ్బంధనం చేయడంతో షాబూ కుటుంబం అక్కడ చిక్కుకుపోయింది. ఈ క్రమంలోనే ఆమె తాజాగా పీటీఐతో ఫోన్‌లో మాట్లాడుతూ తమను అక్కడి నుంచి తరలించాలని భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.

బందీలకు ఏదైనా జరిగితే.. మిమ్మల్ని వదలం..: హమాస్‌ను హెచ్చరించిన ఇజ్రాయెల్‌

‘‘మేం అత్యంత దారుణమైన యుద్ధాన్ని చూస్తున్నాం. బాంబు దాడుల్లో ప్రతి భవనం క్షణాల్లో నేలకూలుతోంది. సామాన్య పౌరులపైనా దాడులు జరుగుతున్నాయి. హమాస్‌ దాడికి మేం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. పరిస్థితి చాలా భయానకంగా ఉంది. బాంబు శబ్దాలతో వణికిపోతున్నాం. నీళ్లు రావట్లేదు. కరెంట్‌ లేదు. ఇంటర్నెట్‌ కనెక్షన్‌ కూడా అంతంతమాత్రంగానే ఉంది. ఎక్కడికి వెళ్దామన్నా బాంబుల మోతే. సురక్షిత ప్రాంతమనేదే లేకుండా పోయింది. గాజా స్ట్రిప్‌ చాలా చిన్న ప్రాంతం. కానీ అన్ని వైపుల నుంచి మూసేశారు. దీంతో బయటకు వెళ్లే మార్గమే లేకుండా పోయింది’’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

తమకు సాయం చేయాలని రమల్లాలోని భారత ప్రతినిధుల కార్యాలయాన్ని కోరామని, కానీ ఇంతవరకూ ఎలాంటి స్పందనా రాలేదని ఆమె తెలిపారు. కాగా.. దీనిపై భారత ప్రతినిధుల కార్యాలయం స్పందిస్తూ.. ‘‘గాజాలో చిక్కుకున్న భారతీయులను తరలించేందుకు మేం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ క్షేత్రస్థాయిలో యుద్ధ పరిస్థితులు సహకరించడం లేదు’’ అని పేర్కొంది.

హమాస్‌పై ప్రతిదాడులు చేపట్టిన ఇజ్రాయెల్‌.. గాజాను సీజ్‌ చేసింది. విద్యుత్తు, ఆహారం, ఇంధనాన్ని నిలిపేసింది. అటు గాజాలోని హమాస్‌ స్థావరాలపై బాంబులు జారవిడుస్తోంది. గాజా నుంచి బయటకు వెళ్లేందుకు ఏకైక మార్గం రఫా క్రాసింగ్‌. అయితే బాంబు దాడులతో అక్కడకు వెళ్లే మార్గం మూసుకుపోయింది. దీంతో గాజాలోని సామన్య పౌరులు ఆ ప్రాంతం నుంచి బయటపడలేకపోతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని