Eluru: డిజిటల్‌ అరెస్ట్‌లో తీగ లాగితే అంతర్జాతీయ సైబర్‌ ముఠా గుట్టు రట్టు

Eenadu icon
By Crime News Desk Updated : 02 Nov 2025 06:16 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
5 min read

మ్యూల్‌ ఖాతాలతో రూ.లక్షల్లో దోపిడీ
దోచుకున్న సొత్తు క్రిప్టోలోకి మార్పు
కాంబోడియా కేంద్రంగా వ్యవస్థీకృత నేర దందా
చైనా హ్యాండ్లర్ల తరఫున ఏజెంట్లుగా వ్యవహరిస్తున్న కొంతమంది
6 రాష్ట్రాల్లో ఆపరేషన్లు.. 11 మందిని అరెస్ట్‌ చేసిన ఏలూరు పోలీసులు

పట్టుబడిన సైబర్‌ నేరస్థులు

ఈనాడు, అమరావతి: ఒక్క డిజిటల్‌ అరెస్ట్‌ కేసు దర్యాప్తు చేస్తే 400కు పైగా నేరాలకు పాల్పడ్డ సైబర్‌ నేరాల ముఠా గుట్టురట్టయ్యింది. 150 మ్యూల్‌ ఖాతాలు, 112 చైనీస్‌ పేమెంట్‌ గేట్‌వేలు, వందల కొద్దీ టెలిగ్రామ్‌ గ్రూపులతో కాంబోడియా కేంద్రంగా సాగిస్తున్న వ్యవస్థీకృత నేర దందా బయటపడింది. ఈ కుంభకోణం కోసం చైనా, హాంగ్‌కాంగ్, సింగపూర్, అమెరికాల్లో క్లౌడ్‌ సర్వర్లు పెట్టుకుని మరీ దోచుకుంటున్న విషయం వెలుగుచూసింది.

ఏలూరు రెండో పట్టణ పోలీసుస్టేషన్‌ పరిధిలో సెప్టెంబరులో నమోదైన ఓ డిజిటల్‌ అరెస్ట్‌ కేసు దర్యాప్తులో తీగ లాగితే.. అంతర్జాతీయ స్థాయి వరకు విస్తరించిన డిజిటల్‌ బెదిరింపులు, మనీ లాండరింగ్‌ ముఠా డొంక కదిలింది. 6 రాష్ట్రాల్లో ఆపరేషన్లు నిర్వహించిన ఏలూరు పోలీసులు మొత్తం 11 మందిని అరెస్ట్‌ చేశారు. ఈ నెట్‌వర్క్‌ సూత్రధారులు విదేశాల్లో ఉన్నట్లు గుర్తించారు. సైబర్‌ నేరాల విభాగం ఐజీ ఆకే రవికృష్ణ, ఏలూరు ఎస్పీ కె.ప్రతాప్‌ శివకిశోర్‌ శనివారం మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో విలేకర్లకు ఈ వివరాలు వెల్లడించారు. డిజిటల్‌ అరెస్ట్‌ అనేది లేనే లేదని, అలా ఎవరైనా బెదిరిస్తే టోల్‌ఫ్రీ నంబరు 1930కి ఫోన్‌ చేయాలని సూచించారు.

విలేకర్లకు వివరాలు వెల్లడిస్తున్న సైబర్‌ నేరాల విభాగం ఐజీ ఆకే రవికృష్ణ, ఏలూరు ఎస్పీ కె.ప్రతాప్‌ శివకిశోర్‌ తదితరులు

డిజిటల్‌ అరెస్ట్‌ పేరిట రూ.51.90 లక్షల దోపిడీ

ఏలూరుకు చెందిన న్యాయవాది రమాదేవికి (66) కొద్ది రోజుల కిందట వాట్సప్‌లో వీడియో కాల్‌ వచ్చింది. అవతలి వ్యక్తి తాను దిల్లీ ఈడీ విభాగానికి చెందిన పోలీసు అధికారినని పరిచయం చేసుకున్నారు. తర్వాత మరికొందరు వీడియోకాల్‌లోకి వచ్చి ‘మీ ఆధార్‌ కార్డుతో అనేక ఆర్థిక మోసాలు జరిగాయి. మీపై డిజిటల్‌ అరెస్ట్‌ వారెంట్‌ జారీ అయ్యింది. మిమ్మల్ని అరెస్ట్‌ చేయకుండా ఉండాలంటే మా ఖాతాల్లో డబ్బులు వేయండి. ఈ విషయం ఎవరికైనా చెబితే మిమ్మల్ని వెంటనే అరెస్ట్‌ చేస్తాం’ అని బెదిరించారు. 72 గంటల పాటు డిజిటల్‌ అరెస్ట్‌లో ఉంచారు. పాస్‌పోర్టు రద్దు చేస్తామని భయపెట్టారు. రమాదేవి ఇదంతా నిజమేనని నమ్మేశారు. పాస్‌పోర్టు రద్దయితే అమెరికాలో ఉన్న తన పిల్లల దగ్గరకు వెళ్లలేనన్న భయంతో సైబర్‌ నేరగాళ్లు చెప్పినట్లుగా వారి ఖాతాల్లో రూ.51.90 లక్షలు జమ చేశారు. దీని కోసం ఆమె బంగారం తాకట్టు పెట్టారు. అప్పులు తీసుకున్నారు. అనంతరం మోసపోయానని గుర్తించి ఏలూరు ఎస్పీ ప్రతాప శివకిశోర్‌కు సెప్టెంబరు 20న ఫిర్యాదు చేశారు.


కర్ణాటకలో తీగ లాగితే యూపీ, మహారాష్ట్ర, బిహార్, గోవాల్లో కదిలిన డొంక

  • రమాదేవి డబ్బులు జమ చేసిన ఖాతా బెంగళూరుకు చెందిన మహ్మద్‌ హసన్‌ ‘ఎస్‌ బ్యాంక్‌’ ఖాతా అని ఏలూరు పోలీసులు గుర్తించారు. బెంగళూరు వెళ్లి హసన్‌ను విచారించగా అతను ఆ ఖాతాను సైబర్‌ నేరగాళ్లకు అమ్మేసుకున్నట్లుగా తేలింది. దీన్నే మ్యూల్‌ ఖాతా అని పిలుస్తారు. హసన్‌ చెప్పిన వివరాల ఆధారంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని హర్దోయి, సీతాపూర్, బారాబంకి జిల్లాల్లో సోదాలు నిర్వహించి ఏడుగుర్ని అరెస్ట్‌ చేశారు. విచారణలో వీరు వెల్లడించిన అంశాల ఆధారంగా మహారాష్ట్రలోని నాగ్‌పుర్, యవత్మాల్, అమరావతిల్లో సోదాలు జరిపిన పోలీసులు ఈ ముఠా కార్యకలాపాల్లో ఒక బ్యాంక్‌ ఉద్యోగి, ఓ కానిస్టేబుల్‌ పాత్ర ఉన్నట్లు గుర్తించారు.
  • చైనాలోని హ్యాండ్లర్ల తరఫున పట్నా, చాప్రాల్లో భారీ నెట్‌వర్క్‌ పనిచేస్తున్నట్లు తేల్చారు. ఈ కుట్రదారులంతా గోవాలో తరచూ సమావేశమైనట్లు గుర్తించారు.

మ్యూల్‌ ఖాతాల కోసం టెలిగ్రామ్‌ గ్రూపులు 

  • కాంబోడియా నుంచి ఈ మోసపూరిత ఫోన్‌కాల్స్‌ చేస్తున్నారు. డార్క్‌వెబ్‌ ద్వారా సమాచారం సేకరించి, ప్రధానంగా వృద్ధుల్నే లక్ష్యంగా చేసుకుంటున్నారు. 
  • డిజిటల్‌ అరెస్ట్‌ల పేరిట బెదిరించి, సొత్తును జమ చేయించుకోవడానికి అవసరమైన మ్యూల్‌ ఖాతాల కోసం ప్రత్యేకంగా ఏజెంట్లను నియమించుకున్నారు. టెలిగ్రామ్‌ యాప్‌లో వందల గ్రూపులు నిర్వహిస్తూ.. మ్యూల్‌ ఖాతాలు సేకరిస్తున్నారు. ప్రతిగా వారికి కమీషన్‌ చెల్లిస్తున్నారు.
  • సైబర్‌ నేరగాళ్లు బాధితులు, మ్యూల్స్‌ ఖాతాదారుల ఫోన్లకు ఏపీకే ఫైల్స్‌ (చైనాలోని అలీబాబా సర్వర్లకు లింకయి ఉన్నాయి) పంపించి వారి ఫోన్‌ మొత్తాన్ని తమ కంట్రోల్‌లోకి తీసుకుంటున్నారు. ఆ ఖాతాల్లోని డబ్బును తామే వేర్వేరు ఖాతాల్లోకి మళ్లిస్తున్నారు. ఈ మొత్తాన్ని క్రిప్టో కరెన్సీలోకి మార్చి, అంతిమ లబ్ధిదారుకు చేరుస్తున్నారు. ఐదు క్రిప్టో వ్యాలట్ల ద్వారా ఈ ముఠా 40కి పైగా లావాదేవీలు నిర్వహించినట్లు గుర్తించారు. 

అరెస్టైన సైబర్‌ నేరగాళ్లు.. వారి పాత్రలు 

1. పూనమ్‌ ప్రవీణ్‌ సోనవానే (ముంబయి): భారీ ఎత్తున నగదు లావాదేవీలు నిర్వహించడానికి అనువుగా ఉండే బ్యాంక్‌ ఖాతాల వివరాల్ని సేకరించి, సైబర్‌ నేరగాళ్లకు అందజేస్తారు. మాయా అనే మారుపేరుతో ఆమె ఈ దందా నిర్వహించారు. 

2. సచీంద్ర శర్మ (ఉత్తర్‌ప్రదేశ్‌): చైనా హ్యాండ్లర్ల తరఫున భారత్‌లో ఏజెంట్‌. దోచుకున్న సొత్తును క్రిప్టో కరెన్సీలోకి మార్చిన తర్వాత సంబంధీకులకు కమీషన్ల పంపిణీలో కీలకపాత్ర.

3. నితిన్‌ మిశ్రా (ఉత్తర్‌ప్రదేశ్‌): బాధితుల ఫోన్లకు ఏపీకే ఫైల్స్‌ పంపించి, వారి బ్యాంకు ఖాతాల్లోని నిధులను మోసపూరితంగా మళ్లించుకోవడంలో దిట్ట

4. అభిషేక్‌ కశ్యప్, గోపాల్‌ యాదవ్‌ (ఉత్తర్‌ప్రదేశ్‌): మ్యూల్‌ ఖాతాల్లో భారీ మొత్తాల్లో పడ్డ సొమ్మును క్రిప్టో వ్యాలట్లలోకి మళ్లించడంలో కీలకపాత్ర. బెంగళూరుకు చెందిన మ్యూల్‌ ఖాతాదారు మహ్మద్‌ హసన్‌ను బెదిరించి, నిర్బంధించింది వీరిద్దరే.

5. సందీప్‌ సురేష్‌ అలోనీ (యవత్‌మల్, మహారాష్ట్ర): బ్యాంకు ఉద్యోగి. భారీ మొత్తాల్లో లావాదేవీలు నిర్వహించేందుకు అనువైన ఖాతాల వివరాల్ని సైబర్‌ నేరగాళ్ల ముఠాకు ఇచ్చారు.

6. సందీప్‌ వక్‌పంజర్‌ (కానిస్టేబుల్‌): బ్యాంకు ఉద్యోగి, సైబర్‌ నేరగాళ్ల మధ్య అనుసంధానకర్త.

Tags :
Published : 02 Nov 2025 05:29 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని