కలుషితాహారం తిని.. 70 మంది విద్యార్థినులకు అస్వస్థత

తెలంగాణలోని వనపర్తి జిల్లా అమరచింత కస్తూర్బా విద్యాలయంలో విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.

Updated : 07 Jul 2023 12:32 IST

వనపర్తి: తెలంగాణలోని వనపర్తి జిల్లా అమరచింత కస్తూర్బా విద్యాలయంలో కలుషిత ఆహారం కలకలం రేపింది. రాత్రి తీసుకున్న భోజనం వికటించి 70 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ కేజీబీవీలో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు మొత్తం 210 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. నిన్న రాత్రి వీరికి వంకాయ, సాంబారుతో కూడిన ఆహారాన్ని వడ్డించారు. రాత్రి భోజనం అయ్యాక 11 గంటల ప్రాంతంలో విద్యార్థినులకు కడుపునొప్పి ప్రారంభం కావడంతో ఒక్కొక్కరుగా సిబ్బంది దగ్గరకి వెళ్లారు. కేజీబీవీలో ఒక టీచర్‌, వాచ్‌మన్‌ మాత్రమే ఉండటంతో రాత్రి విద్యార్థినులకు బయటకి పంపలేదు. రాత్రంతా పరిస్థితి అలాగే ఉండటంతో.. తెల్లవారు జామున ఓ ప్రైవేటు ఆటో తీసుకొచ్చిన సిబ్బంది వారందర్నీ సమీపంలోని ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

పిల్లలందరికీ వైద్యులు, సిబ్బంది హుటాహుటిన చికిత్స ప్రారంభించగా.. చాలా వరకు పరిస్థితి అదుపులోకి వచ్చింది. నలుగురు విద్యార్థులకు కడుపునొప్పి తగ్గకపోవడంతో వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు ఒక్కొక్కరుగా ఆత్మకూరు ఆస్పత్రికి చేరుకుంటున్నారు. తమ పిల్లల పరిస్థితి చూసి వారు ఆందోళనకు గురవుతున్నారు. విద్యార్థినులకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు విద్యార్థినుల అస్వస్థతకు గల కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ఆహార కలుషితం జరిగిందా? ఇంకేమైనా కారణాలున్నాయా? అనే కోణంలో విచారిస్తున్నారు. ప్రధానంగా 9, 10, ఇంటర్‌ విద్యార్థినులే అస్వస్థతకు గురైన వారిలో ఉన్నారు. తొలుత 45 మందిని ఆ తర్వాత మరో 15 మందిని ఆస్పత్రిలో చేర్పించారు. ఆహారం విషతుల్యం కావడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని విద్యార్ధినులు వాపోతున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని