GST Irregularities: జీఎస్టీ అక్రమాలపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌

జీఎస్టీ ఎగవేత అక్రమాల్లో ఐఐటీకి చెందిన ఒక ప్రొఫెసర్‌తో పాటు ముగ్గురు అధికారుల పాత్ర ఉన్నట్లు వాణిజ్య పన్నుల శాఖ అంతర్గత విచారణలో గుర్తించినట్లు తెలిసింది.

Updated : 22 May 2024 10:21 IST

ముగ్గురు సీనియర్‌ అధికారుల పాత్రపై విచారణ
ఐఐటీతో వాణిజ్య పన్నులశాఖ ఒప్పందం ఆసరాగా ఎగవేతదారులకు సహకారం
వాణిజ్య పన్నులశాఖ అంతర్గత విచారణలో వెల్లడి
రూ.వెయ్యి కోట్ల పన్ను ఎగవేసినట్లు గుర్తింపు

ఈనాడు, హైదరాబాద్‌: జీఎస్టీ ఎగవేత అక్రమాల్లో ఐఐటీకి చెందిన ఒక ప్రొఫెసర్‌తో పాటు ముగ్గురు అధికారుల పాత్ర ఉన్నట్లు వాణిజ్య పన్నుల శాఖ అంతర్గత విచారణలో గుర్తించినట్లు తెలిసింది. పన్ను ఎగవేతను అరికట్టడంలో మరింత పారదర్శకత తెచ్చేందుకు ఆన్‌లైన్‌ వ్యవస్థ అభివృద్ధికి హైదరాబాద్‌ ఐఐటీలోని స్టార్టప్‌ కంపెనీతో శాఖ తరఫున మూడేళ్ల క్రితం ఒప్పందం చేసుకున్నారు. ఐఐటీకి ఏమేం పత్రాలు పంపాలి, ఏయే విభాగాల్లో ఎలాంటి తనిఖీలు చేయాలనే స్పష్టమైన విధివిధానాలను ఒప్పందంలో పేర్కొనలేదు. అయినా ఐఐటీకి చెందిన ప్రొఫెసర్‌ ఒకరు అంతా తానై శాఖకు సంబంధించిన ప్రతి సమాచారాన్ని ఆన్‌లైన్‌ ద్వారా సేకరించినట్లు గుర్తించారు. ఏ వ్యాపారి ఎంత జీఎస్టీ చెల్లిస్తున్నారు? ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ పేరుతో ఎంత సొమ్ము తిరిగి తీసుకుంటున్నారనే వివరాలను ప్రభుత్వానికి పంపే సమయంలో కొన్ని వ్యాపార సంస్థల పేర్లను ఆన్‌లైన్‌లో నుంచి తొలగించేవారని తేలింది. ఈ సంస్థల పేర్లను ఎందుకు దాస్తున్నారని ఎవరూ ప్రశ్నించకుండా, తనిఖీలు చేయకుండా ఒక ఉన్నతాధికారి కాపాడినట్లు సమాచారం. వారి అండ చూసుకుని కొందరు వ్యాపారులు పెద్దఎత్తున జీఎస్టీ ఎగవేయడమే కాకుండా, ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ల పేరుతో భారీగా సొమ్ము వెనక్కి తీసుకున్నారు. ఇప్పటికే రూ.వెయ్యి కోట్ల వరకు జీఎస్టీ ఎగవేతలకు సంబంధించిన అక్రమాలను వాణిజ్య పన్నులశాఖ గుర్తించింది. కొన్ని బోగస్‌ కంపెనీల ఏర్పాటుతో ప్రభుత్వం నుంచి రూ.కోట్లు తీసుకున్నవారిని అరెస్టు చేసింది. ఇంకొందరు వ్యాపారులపై విచారణ జరుగుతోంది. పక్కా ఆధారాలు సేకరించి.. బాధ్యులపై కేసులు పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇద్దరు అధికారుల సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని.. ఫోరెన్సిక్‌ ఆడిట్‌కు పంపించింది. ఇప్పటివరకూ సేకరించిన ఆధారాల ప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఐఐటీ డైరెక్టర్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి శాఖ లేఖలు రాసింది.

ఐఐటీ సర్వర్‌ నుంచి బయటివారికి సమాచారం

ఐఐటీ ప్రొఫెసర్‌తో పాటు ముగ్గురు అధికారులు ప్రత్యేకంగా వాట్సప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసి. గత మూడేళ్లుగా ఎప్పటికప్పుడు సమాచారం చేరవేసుకున్నట్లు విచారణలో తేలింది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత డిసెంబరు నెలాఖరు వరకూ ఈ సమాచార మార్పిడి కొనసాగించారని సమాచారం. పన్ను వసూళ్లకు సంబంధించి ఐఐటీ నుంచి సేకరించిన నివేదికల్లో.. కొన్ని వ్యాపార సంస్థల పేర్లు ఆన్‌లైన్‌లో కనపడకుండా దాచినట్లు గుర్తించారు. వాటి వివరాలు తెలుసుకునేందుకు తాజాగా ఫోరెన్సిక్‌ ఆడిట్‌కు పంపారు. వాణిజ్య పన్నులశాఖ సమాచారాన్ని ఐఐటీ సర్వర్‌ నుంచి తీసుకోవడానికి మరికొందరికి కూడా అక్రమంగా అవకాశం కల్పించినట్లు గుర్తించారు. ఇలా ఎందుకు అనుమతి ఇచ్చారని ఐఐటీ ప్రొఫెసర్‌ను ప్రశ్నించగా.. తననేమీ అడగవద్దని అన్నట్లు  అధికారవర్గాలు తెలిపాయి.

పెద్దసంఖ్యలో అక్రమాలు..

ఒక వ్యాపారి రూ.23 కోట్ల జీఎస్టీ కట్టినట్టు బోగస్‌ పత్రాలు సృష్టించి ప్రభుత్వం నుంచి ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ తీసుకున్నారు. ఇందుకు సహకరించిన ఐదుగురు ఉద్యోగులను ఇటీవల అరెస్టు చేసి జైలుకు పంపించారు. దీనిపై లోతుగా విచారణ చేయగా.. ఇలాంటి అక్రమాలు పెద్దసంఖ్యలో ఉన్నట్లు తేలింది. తాజాగా జహీరాబాద్‌ వద్ద హైదరాబాద్‌ నుంచి సోలాపుర్‌కు వెళ్తున్న 8 ఎల్పీజీ ట్యాంకర్లను తనిఖీ చేయగా.. 5 శాతం జీఎస్టీ కట్టినట్లు చూపించారు. వాస్తవానికి 18 శాతం జీఎస్టీ కట్టాలి. పన్ను ఎగవేసినందుకు సంబంధిత వ్యాపారికి రూ.19.18 లక్షల జరిమానా విధించారు. తనిఖీలు లేకపోవడంతో వ్యాపారులు యథేచ్ఛగా బోగస్‌ బిల్లులు పెట్టి ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ పేరుతో వాణిజ్య పన్నులశాఖ నుంచి రూ.కోట్ల పన్నును వెనక్కి తీసుకోవడంతో పాటు.. అసలు సైతం ఎగ్గొట్టారు. తనిఖీలు ప్రారంభమైన తర్వాత నెలకు రూ.200 కోట్ల దాకా జీఎసీ వసూళ్లు పెరగడమే కాకుండా ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ పేరుతో సొమ్ము వెనక్కి ఇవ్వాలని అడిగే వ్యాపారుల సంఖ్య గణనీయంగా తగ్గడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని