కోనేరులో మునిగి ముగ్గురు బాలికల మృతి

పండగ చేసుకుందామని బంధుమిత్రులతో కలిసి ఆలయానికి వెళ్లిన కుటుంబాలను తీరని విషాదం వెంటాడింది.

Published : 29 Mar 2023 05:43 IST

బైరెడ్డిపల్లె, న్యూస్‌టుడే: పండగ చేసుకుందామని బంధుమిత్రులతో కలిసి ఆలయానికి వెళ్లిన కుటుంబాలను తీరని విషాదం వెంటాడింది. అక్కడి కోనేరు ముగ్గురు బాలికలను పొట్టనపెట్టుకుంది. ఈ ఘటన చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె మండలం దేవదొడ్డిలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కదిరప్ప కుటుంబం మంగళవారం తీర్థం గ్రామ శ్రీకాళభైరవేశ్వరస్వామి ఆలయం సమీపంలో కాటేరమ్మ పండగ పెట్టుకున్నారు. బంధుమిత్రులతో కలిసి ఆలయ సమీపంలోని కొండ వద్దకు వెళ్లారు. అక్కడ కుటుంబీకులు, బంధువులు పండగలో నిమగ్నమయ్యారు. ఆ సమయంలో కదిరప్ప కుమార్తె గౌతమి(14), చెల్లెలి కుమార్తె భవ్య(17), అక్క కుమార్తె మౌనిక(14) ఆలయ కోనేరు వద్దకు వెళ్లారు. ముగ్గురూ అందులోకి దిగి నీటిలో మునిగిపోయారు. పండగ ముగిశాక కుటుంబీకులు పిల్లల కోసం వెతికారు. చివరికి కొలను వద్ద చెప్పులు గమనించి, అందులో గాలించి ముగ్గురినీ బయటికి తీశారు. వారిని 108 అంబులెన్సులో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు. వీరిలో గౌతమిది దేవదొడ్డి గ్రామం కాగా... భవ్య, మౌనికది తమిళనాడులోని పేర్నంబట్‌ సమీపంలోని అరట్ల గ్రామం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని