రూ.12,000 కోట్ల డ్రగ్స్‌ పట్టుకొన్న తీరదళం

భారత పశ్చిమప్రాంత తీరదళం రూ.12,000 కోట్ల విలువ చేసే 2,500 కిలోల మాదకద్రవ్యాలను పట్టుకొంది.

Published : 14 May 2023 06:21 IST

భారీమొత్తంలో మెథంఫెటమిన్‌ సీజ్‌

దిల్లీ: భారత పశ్చిమప్రాంత తీరదళం రూ.12,000 కోట్ల విలువ చేసే 2,500 కిలోల మాదకద్రవ్యాలను పట్టుకొంది. ఈ డ్రగ్స్‌తోపాటు పాకిస్థాన్‌కు చెందిన ఓ నిందితుణ్ని నిర్బంధంలోకి తీసుకొన్నట్లు నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు శనివారం వెల్లడించారు. దేశంలో ఇంత పెద్దమొత్తంలో మెథంఫెటమిన్‌ పట్టుబడటం ఇదే మొదటిసారిగా చెప్పారు. ‘ఆపరేషన్‌ సముద్రగుప్త్‌’లో భాగంగా భారత నౌకాదళంతోపాటు యాంటీ నార్కోటిక్స్‌ ఏజెన్సీ సంయుక్తంగా ఈ డ్రగ్స్‌ను సీజ్‌ చేసినట్లు తెలిపారు. పాకిస్థాన్‌, ఇరాన్‌ల సమీపంలో ఉన్న మక్రాన్‌ తీరం నుంచి డ్రగ్స్‌తో బయలుదేరిన ఓ భారీ నౌక దారి పొడవునా ఇతర పడవలకు డ్రగ్స్‌ పంపిణీ చేస్తూ వస్తున్నట్లు వివరించారు. పాకిస్థాన్‌ జాతీయుడైన ఓ వ్యక్తితోపాటు 134 సంచుల్లో ఉన్న మెథంఫెటమిన్‌ను ఈ నౌక నుంచి స్వాధీనం చేసుకొని కేరళలోని కొచ్చిన్‌ రేవులో ఎన్‌సీబీకి నౌకాదళం అప్పగించినట్లు అధికారులు చెప్పారు. ఈ సంచుల్లో ఉన్న డ్రగ్స్‌ ఉన్నత ప్రమాణాలకు చెందినదిగా గుర్తించినట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని