Mancherial: మేక పోయిందని.. మానవత్వం మరచి..

మేక ఎత్తుకెళ్లారని ఆరోపిస్తూ ఓ కుటుంబం పశువుల కాపరితోపాటు అతడి స్నేహితుడిని తలకిందులుగా వేలాడదీసింది.. ఆపై తల కింద పొగబెట్టి చిత్రహింసలకు గురి చేసింది.

Updated : 03 Sep 2023 09:51 IST

ఇద్దరు యువకులను తలకిందులుగా వేలాడదీసి, కింద పొగబెట్టి చిత్రహింసలు
మంచిర్యాల జిల్లాలో ఓ కుటుంబం అమానుష చర్య

మందమర్రి పట్టణం, న్యూస్‌టుడే: మేక ఎత్తుకెళ్లారని ఆరోపిస్తూ ఓ కుటుంబం పశువుల కాపరితోపాటు అతడి స్నేహితుడిని తలకిందులుగా వేలాడదీసింది.. ఆపై తల కింద పొగబెట్టి చిత్రహింసలకు గురి చేసింది. ఈ అమానవీయ సంఘటన మంచిర్యాల జిల్లా మందమర్రిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. మందమర్రికి చెందిన కొమురాజుల రాములు, అతని భార్య స్వరూప, కొడుకు శ్రీనివాస్‌ అంగడిబజార్‌ ప్రాంతంలో నివాసముంటున్నారు. వీరు పట్టణ శివారులోని గంగనీళ్ల పంపుల సమీపంలో షెడ్డు వేసి మేకలు పెంచుతున్నారు. తేజ(19) అనే యువకుడు వీరి ఇంట్లోనే ఉంటూ పశువుల కాపరిగా పని చేస్తున్నాడు. అతని తల్లి పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తుండగా.. తండ్రి లేరు. సుమారు 20 రోజుల క్రితం మంద నుంచి ఒక మేక, ఇనుప రాడ్డు కనిపించకుండా పోయాయి. తేజతోపాటు అతని స్నేహితుడైన దళిత యువకుడు చిలుముల కిరణ్‌(30)లపై అనుమానం వచ్చిన యజమాని కుటుంబసభ్యులు శుక్రవారం ఇద్దరినీ షెడ్డు వద్దకు పిలిపించారు. వారిని కొట్టి.. కాళ్లకు తాళ్లు కట్టి.. తలకిందులుగా వేలాడదీశారు. కింద పొగ పెట్టి ఊపిరాడకుండా చేశారు. అనంతరం ఇద్దరినీ విడిచిపెట్టారు.

ఆచూకీ లేని కిరణ్‌

రామగుండానికి చెందిన కిరణ్‌ తల్లిదండ్రులు చనిపోవడంతో మందమర్రి పట్టణంలోని అబ్రహంనగర్‌లో ఉండే చిన్నమ్మ సరిత ఇంటి వద్ద ఉంటూ భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నారు. శుక్రవారం బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో సరిత ఆందోళన చెందారు. ఈ క్రమంలో కిరణ్‌ను కట్టేసి కొట్టిన ఫొటోలు బయటకు రావడంతో శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రాములు, శ్రీనివాస్‌, స్వరూపతో పాటు వారి వద్ద పనిచేస్తున్న నరేశ్‌పై ఎట్రాసిటీ కేసు నమోదు చేశారు. బెల్లంపల్లి ఏసీపీ పంతాటి సదయ్య, ఎస్సై చంద్రకుమార్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని