గ్రూప్‌-2 అభ్యర్థిని ఆత్మహత్య

పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న ఒక అభ్యర్థిని ఆత్మహత్యకు పాల్పడటం హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో కలకలం రేపింది. చిక్కడపల్లి పోలీసు స్టేషన్‌ పరిధిలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది.

Updated : 14 Oct 2023 12:46 IST

హాస్టల్‌లో ఉరి వేసుకుని..
పరీక్ష వాయిదా వల్లే.. అంటూ ఇతర అభ్యర్థుల నిరసన

రాంనగర్‌, గాంధీనగర్‌, న్యూస్‌టుడే: పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న ఒక అభ్యర్థిని ఆత్మహత్యకు పాల్పడటం హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో కలకలం రేపింది. చిక్కడపల్లి పోలీసు స్టేషన్‌ పరిధిలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌ జిల్లా బిక్కాజిపల్లికి చెందిన మర్రి ప్రవళిక (23) అశోక్‌నగర్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటూ గ్రూప్‌-2 పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతోంది. శుక్రవారం సాయంత్రం హాస్టల్‌లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తోటి విద్యార్థులు ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా... అప్పటికే అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్న అభ్యర్థులు అడ్డుకున్నారు. పరీక్ష వాయిదా పడడం వల్లే మనస్తాపంతో ఆమె ఆత్మహత్య చేసుకుందన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అర్ధరాత్రి వరకు మృతదేహం హాస్టల్‌లోనే ఉంది. భాజపా ఎంపీ లక్ష్మణ్‌, ఆ పార్టీ నాయకురాలు బండారు విజయలక్ష్మి, సికింద్రాబాద్‌ డీసీసీ అధ్యక్షుడు అనిల్‌కుమార్‌ యాదవ్‌ ఘటనా స్థలానికి చేరుకుని నిరసన తెలిపారు.

‘నా వల్ల మీకు ఎప్పుడూ బాధే’

ప్రవళిక రాసిన సూసైడ్‌ నోట్‌గా చెబుతున్న లేఖ వాట్సాప్‌ గ్రూప్‌లో చక్కర్లు కొట్టింది. ‘నన్ను క్షమించండి అమ్మా! నేను చాలా నష్టజాతకురాలిని. నా వల్ల మీరు ఎప్పుడూ బాధపడుతూనే ఉన్నారు. ఏడవకండి అమ్మా.. జాగ్రత్తగా ఉండండి. మీకు పుట్టడం నా అదృష్టం అమ్మా.. నన్ను కాళ్లు కింద పెట్టకుండా చూసుకున్నారు.. మీకు నేను చాలా అన్యాయం చేస్తున్నా.. నన్ను ఎవరూ క్షమించరు. మీ కోసం నేను ఏం చేయలేకపోతున్నా అమ్మా.. నాన్న జాగ్రత్త!’ అంటూ ఆ లేఖలో ఉంది.

అర్ధరాత్రి వరకు ఉద్రిక్తత

మర్రి ప్రవళిక కుటుంబ వివరాలు తెలియాల్సి ఉంది. ఆధార్‌ కార్డుపై వివరాల ప్రకారం తండ్రి లింగయ్య అని ఉంది. ఆమె కుటుంబానికి న్యాయం చేసేవరకు కదలబోమని గ్రూప్స్‌ అభ్యర్థులు రహదారిపై అర్ధరాత్రి నిరసనకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. సెంట్రల్‌జోన్‌ డీసీపీ వెంకటేశ్వర్లు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించి.. అభ్యర్థులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. క్రైమ్స్‌ అండ్‌ సిట్‌ సంయుక్త పోలీసు కమిషనర్‌ గజరావు భూపాల్‌, చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి, సెంట్రల్‌ జోన్‌ ట్రాఫిక్‌ ఏసీపీ రత్నం అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఇన్‌స్పెక్టర్‌ నరేశ్‌ దర్యాప్తు చేస్తున్నారు. 


అర్ధరాత్రి దాటాక ప్రవళిక మృతదేహం తరలింపు 
ఈనాడు, హైదరాబాద్‌: ఆందోళనకు దిగిన అభ్యర్థులపై పోలీసులు అర్ధరాత్రి దాటిన తర్వాత లాఠీఛార్జి చేశారు. దాంతో అభ్యర్థులు పోలీసులపై రాళ్లు రువ్వారు. ఉద్రిక్త పరిస్థితుల నడుమ రాత్రి 1.30 ప్రాంతంలో ప్రవళిక మృతదేహాన్ని పోలీసులు అంబులెన్స్‌లో గాంధీ ఆసుపత్రికి తరలించారు. అభ్యర్థులతో కలిసి ఆందోళనకు దిగిన సికింద్రాబాద్‌ డీసీసీ అధ్యక్షుడు అనిల్‌కుమార్‌ యాదవ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పరిస్థితిని అదుపు చేసేందుకు సీఆర్‌పీఎఫ్‌ దళాలను పోలీసులు రంగంలోకి దించారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు