కుప్పకూలిన శిక్షణ విమానం

మెదక్‌ జిల్లా తూప్రాన్‌లోని రావెళ్లి శివారులో సోమవారం దుండిగల్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీకి చెందిన ‘పైలట్‌ పీసీ 7 ఎంకె 2’ శిక్షణ విమానం ప్రమాదవశాత్తు కుప్పకూలడంతో.. అందులోని పైలట్‌, శిక్షణ పొందుతున్న మరో వ్యక్తి మృతి చెందారు.

Published : 05 Dec 2023 04:02 IST

పైలట్‌ సహా వియత్నాం వ్యక్తి మృతి

తూప్రాన్‌, దుండిగల్‌, న్యూస్‌టుడే: మెదక్‌ జిల్లా తూప్రాన్‌లోని రావెళ్లి శివారులో సోమవారం దుండిగల్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీకి చెందిన ‘పైలట్‌ పీసీ 7 ఎంకె 2’ శిక్షణ విమానం ప్రమాదవశాత్తు కుప్పకూలడంతో.. అందులోని పైలట్‌, శిక్షణ పొందుతున్న మరో వ్యక్తి మృతి చెందారు. స్థానిక పోలీసులు, ఎయిర్‌ఫోర్స్‌ అధికారులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శిక్షకుడు అభిమన్యురాయ్‌ (35), శిక్షణ కోసం వియత్నాం నుంచి వచ్చిన వువాన్‌ తైన్‌ (26)తో కలిసి దుండిగల్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ నుంచి విమానంలో బయలుదేరారు. ఉదయం 8.30 గంటల సమయంలో రావెళ్లి శివారులో గుట్టపై ఉన్న రాళ్లపై విమానం కుప్పకూలింది. భారీ శబ్దం రావడంతో సమీపంలోని స్థానికులు ప్రమాదస్థలానికి చేరుకున్నారు.  సమాచారం అందుకుని.. దుండిగల్‌ ఎయిర్‌ఫోర్స్‌ అధికారులు అక్కడికి వచ్చారు.  గ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. విమానంలో ప్రయాణించిన ఇద్దరూ ప్రాణాలు కాపాడుకునేందుకు కిందకు దూకి ఉంటారనే అనుమానంతో గుట్టల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. మంటలు ఆర్పిన తర్వాత కాలిపోయి ఉన్న ఇద్దరి మృతదేహాలను గుర్తించి సికింద్రాబాద్‌ ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. తూప్రాన్‌ డీఎస్పీ యాదగిరిరెడ్డి, సీఐ శ్రీధర్‌, ఎస్సై శివానందం కలిసి అక్కడ బందోబస్తు చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్లు భారత వాయుసేన ప్రధాన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. పౌరులకు సంబంధించి ఆస్తి, ప్రాణ నష్టమేమీ జరగలేదని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని