East Godavari: సినీఫక్కీలో బస్సును వెంబడించి.. ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి

నెల్లూరు జిల్లా కావలిలో ఆర్టీసీ డ్రైవర్‌పై మూకుమ్మడి దాడి మరవక ముందే తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ఓ ఆర్టీసీ డ్రైవర్‌పై పలువురు దాడి చేశారు.

Updated : 10 Dec 2023 10:28 IST

నిడదవోలు, న్యూస్‌టుడే: నెల్లూరు జిల్లా కావలిలో ఆర్టీసీ డ్రైవర్‌పై మూకుమ్మడి దాడి మరవక ముందే తూర్పుగోదావరి జిల్లా(East Godavari) నిడదవోలులో ఓ ఆర్టీసీ డ్రైవర్‌పై పలువురు దాడి చేశారు. తాడేపల్లిగూడెం డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు శనివారం సాయంత్రం రాజమహేంద్రవరం నుంచి నిడదవోలు మీదుగా తాడేపల్లిగూడెం బయలుదేరింది. రాజమహేంద్రవరం షెల్టన్‌ హోటల్‌ దగ్గరకు వచ్చేసరికి స్థానికుడైన సువ్వాడ గోవిందరాజు ద్విచక్రవాహనంపై బస్సుకు అడ్డంగా వచ్చారు. ఆర్టీసీ డ్రైవర్‌ గూడవల్లి ధనశంకర నాగరాజు బస్సును ఆపి, అంత కంగారు ఎందుకంటూ అతణ్ని ప్రశ్నించారు. మాటామాటా పెరగడంతో గోవిందరాజు డ్రైవర్‌పైకి కంకరరాయి విసిరాడు. చుట్టుపక్కలవాళ్లు వచ్చి సర్దిచెప్పడంతో బస్సు వెళ్లిపోయింది. అయితే గోవిందరాజుతో పాటు మరికొందరు సినీఫక్కీలో బస్సును వెంబడించారు. నిడదవోలు గణపతి సెంటర్‌కు వచ్చేసరికి రోడ్డుకు అడ్డంగా జీపు పెట్టారు. డ్రైవర్‌ను కాలర్‌ పట్టుకుని కిందకు లాగి, రాడ్‌తో తలపైన, ఎడమ కాలిపై కొట్టారు. తనను దుర్భాషలాడి, దాడి చేశారంటూ డ్రైవర్‌ నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజమహేంద్రవరానికి చెందిన సువ్వాడ గోవిందరాజు, సువ్వాడ భార్గవ్‌, మజ్జి ప్రవీణ్‌, నిడదవోలుకు చెందిన మహమ్మద్‌ మున్నావర్‌లపై కేసు నమోదు చేసినట్లు నిడదవోలు పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని