సీనియర్‌ ఐఏఎస్‌ విచారణకు సన్నద్ధం!

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ శివబాలకృష్ణ ఉదంతంలో అనిశా కీలక నిర్ణయం తీసుకుంది.

Published : 12 Feb 2024 06:07 IST

 శివబాలకృష్ణ నేరాంగీకార  వాంగ్మూలంతో అనిశా దూకుడు

ఈనాడు, హైదరాబాద్‌: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ శివబాలకృష్ణ ఉదంతంలో అనిశా కీలక నిర్ణయం తీసుకుంది. శివబాలకృష్ణ నేరాంగీకార వాంగ్మూలంలో తన వాటాదారుగా పేర్కొన్న సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిని విచారించేందుకు సిద్ధమైంది. అయితే ఆయన్ను తొలుత సాక్షిగా మాత్రమే పిలవనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే 160 సీఆర్పీసీ నోటీసు ఇచ్చే యోచనలో ఉంది. శివబాలకృష్ణ నేరాంగీకార వాంగ్మూలంలో సదరు ఐఏఎస్‌ గురించి పలు అంశాలు ప్రస్తావించిన సంగతి తెలిసిందే. పలు వివాదాస్పద భూములకు అనుమతులు ఇప్పించినందుకు ఇద్దరికీ భారీగా లబ్ధి చేకూరిందని అంగీకరించాడు. ఆ డబ్బులతో కొనుగోలు చేసిన భూములు, ఎవరి పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించారు వంటి వివరాలను వెల్లడించాడు. తాను స్వయంగా ఐఏఎస్‌ ఇంటికెళ్లి కొంత డబ్బు ఇచ్చినట్లు చెప్పడం ప్రాధాన్యం సంతరించుకొంది. అనిశా ఈ విషయాలన్నింటినీ న్యాయస్థానానికి ఇప్పటికే సమర్పించింది. అయితే ఈ వాంగ్మూలంతో ఐఏఎస్‌ అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారించే అవకాశం లేదు. అందుకు తగిన ఆధారాలను సంపాదించి నిగ్గు తేల్చాల్సి ఉంటుంది. ఆయా ఒప్పందాలు జరిగిన సమయంలో శివబాలకృష్ణ, ఐఏఎస్‌ల మధ్య ఫోన్‌కాల్స్‌, వాట్సప్‌ సంభాషణలతోపాటు ఇద్దరి ఫోన్‌ లొకేషన్లకు సంబంధించి సెల్‌టవర్‌ డేటాను సేకరించాలి. దీనికి మరికొంత సమయం పట్టనుండటంతో తొలుత ఆయన్ను సాక్షిగా పిలిచి విచారించాలని అనిశా యోచిస్తోంది. ఇందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేకపోవడంతో నోటీసు జారీ చేయాలని భావిస్తోంది. ఐఏఎస్‌ వాటాలు తీసుకున్నట్లు నిర్ధారణైతే 41ఏ సీఆర్పీసీ నోటీసు జారీ చేసి మళ్లీ విచారించనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆయన్ను అరెస్టు చేయాల్సి వస్తే ప్రభుత్వం నుంచి అనుమతి కోరే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని