పారాగ్లైడింగ్‌ చేస్తూ జహీరాబాద్‌ వివాహిత మృతి

సాఫ్ట్‌వేర్‌ దంపతుల విహారయాత్ర విషాదంగా మారింది. భర్త కళ్లముందే పారాగ్లైడింగ్‌ చేస్తున్న భార్య ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయింది. హిమాచల్‌ప్రదేశ్‌లోని కులూలో ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Updated : 13 Feb 2024 22:55 IST

హిమాచల్‌ప్రదేశ్‌లోని కులూలో ప్రమాదం

జహీరాబాద్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: సాఫ్ట్‌వేర్‌ దంపతుల విహారయాత్ర విషాదంగా మారింది. భర్త కళ్లముందే పారాగ్లైడింగ్‌ చేస్తున్న భార్య ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయింది. హిమాచల్‌ప్రదేశ్‌లోని కులూలో ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ పట్టణం శిల్ప బృందావనం కాలనీకి చెందిన సాయి మోహన్‌, నవ్య(26) దంపతులు చండీగఢ్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులుగా పని చేస్తున్నారు. ఏడాదిన్నర కిందట వీరికి వివాహమైంది. విహారయాత్ర కోసం శనివారం హిమాచల్‌ప్రదేశ్‌లోని కులూకు వెళ్లారు. ఆదివారం మధ్యాహ్నం నవ్య పారాగ్లైడింగ్‌ చేస్తుండగా కొద్దిసేపటికే హుక్‌ ఊడిపోయి ఓ ఇంటి పైకప్పుపై పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆమెతో పారాగ్లైడింగ్‌ చేయించిన పైలట్‌ ప్రాణాలతో బయటపడ్డాడు. మానవ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని హిమాచల్‌ప్రదేశ్‌ పర్యాటక అధికారులు బాధిత కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. పైలట్‌ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసి కేసు నమోదు చేశామని తెలిపారు. పారాగ్లైడింగ్‌ చేస్తున్నామని వీడియోకాల్‌ మాట్లాడిన కాసేపటికే ప్రమాదం జరిగిందని చెబుతూ సాయిమోహన్‌ తండ్రి తిరుమలరావు, కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. కులూలో శవపరీక్షల అనంతరం అధికారులు సోమవారం రాత్రి మృతదేహాన్ని విమానంలో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు తరలించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని