కాళ్ల పారాణి ఆరకముందే కలలు చెదిరాయి

పెళ్లయి వారం కూడా కాలేదు.. వధూవరుల కాళ్ల పారాణి ఆరలేదు. అంతలోనే మృత్యువు పగబట్టింది. రోడ్డు ప్రమాద రూపంలో నవ వరుడు, వధువు తండ్రి సహా ముగ్గురిని పొట్టన పెట్టుకుంది.

Updated : 22 Feb 2024 08:02 IST

రోడ్డు ప్రమాదంలో నవ వరుడు, మామ, డ్రైవర్‌ దుర్మరణం
తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో వధువు

అడ్డాకుల, న్యూస్‌టుడే: పెళ్లయి వారం కూడా కాలేదు.. వధూవరుల కాళ్ల పారాణి ఆరలేదు. అంతలోనే మృత్యువు పగబట్టింది. రోడ్డు ప్రమాద రూపంలో నవ వరుడు, వధువు తండ్రి సహా ముగ్గురిని పొట్టన పెట్టుకుంది. ఎన్నో కలలతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన వధువు గాయాలతో ఆసుపత్రి పాలైంది. మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూరు మండలం అన్నసాగర్‌ వద్ద బుధవారం చోటుచేసుకున్న ఈ ప్రమాదం ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ఏపీలోని అనంతపురానికి చెందిన వెంకటరమణ (55) నంద్యాల జిల్లా రాచర్ల ఎస్సైగా పనిచేస్తున్నారు. ఆయన ఏకైక కుమార్తె అనూషకు హైదరాబాద్‌లోని మణికొండలో స్థిరపడిన కృష్ణా జిల్లాకు చెందిన పవన్‌సాయి కుమార్‌తో ఈ నెల 15న అనంతపురంలో వివాహమైంది.  హైదరాబాద్‌లోని పెళ్లి కుమారుడి ఇంట్లో ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్న వధువు బంధువులు బుధవారం సాయంత్రం రెండు కార్లలో అనంతపురానికి తిరుగు పయనమయ్యారు. ఒక కారులో వెంకటరమణ (55), పవన్‌సాయి కుమార్‌ (25), అనూష, డ్రైవరు చంద్ర (24) వెళ్తున్నారు. అన్నసాగర్‌ వద్దకు రాగానే అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి జాతీయ రహదారి పక్కనున్న రెయిలింగ్‌ను బలంగా ఢీకొట్టింది. తర్వాత గాల్లోకి ఎగిరి రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో వెంకటరమణ, పవన్‌సాయి, డ్రైవరు చంద్ర అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన అనూషను హైదరాబాద్‌కు తరలించారు.  సంఘటన స్థలాన్ని మహబూబ్‌నగర్‌ డీఎస్పీ వెంకటేశ్వర్లు, భూత్పూరు సీఐ రామకృష్ణ పరిశీలించారు. దాంపత్య జీవితంలోకి కొత్తగా అడుగుపెట్టిన నవ వధువు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కుమార్తె అచ్చటా ముచ్చటా చూడకుండానే తండ్రి తనువు చాలించటం తీవ్ర విషాదాన్ని నింపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని