రాడిసన్‌ డ్రగ్స్‌ కేసులో గోవా లింకు

హైదరాబాద్‌ రాడిసన్‌ హోటల్‌లో డ్రగ్స్‌ పార్టీ కేసుపై లోతుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులకు గోవా లింకు లభించింది.

Updated : 03 Mar 2024 07:04 IST

ప్రధాన సూత్రధారి అక్కడి జైలులో ఉండే అబ్దుల్‌
అతని నుంచి అబ్దుల్‌ రెహ్మాన్‌కు.., ఆపై మీర్జా వహీద్‌ బేగ్‌, అబ్బాస్‌, వివేకానంద్‌లకు

ఈనాడు- హైదరాబాద్‌, మాదాపూర్‌, న్యూస్‌టుడే: హైదరాబాద్‌ రాడిసన్‌ హోటల్‌లో డ్రగ్స్‌ పార్టీ కేసుపై లోతుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులకు గోవా లింకు లభించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మంజీరా గ్రూపు సంస్థల డైరెక్టర్‌ గజ్జల వివేకానంద్‌కు డ్రగ్స్‌ ఎక్కడి నుంచి అందుతున్నాయని కూపీలాగే క్రమంలో గోవాలోని ఒక జైలులో విచారణ ఖైదీగా ఉన్న అబ్దుల్‌ అనే డ్రగ్స్‌ నెట్‌వర్క్‌ కింగ్‌పిన్‌ గురించి తెలిసింది. అతని ఆదేశాలతోనే హైదరాబాద్‌లోని రాణిగంజ్‌కు చెందిన అబ్దుల్‌ రెహ్మాన్‌కు భారీగా కొకైన్‌ అందుతోందని, అతడి నుంచి అత్తాపూర్‌లోని కేఫ్‌ రెస్టారెంట్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్న మీర్జా వహీద్‌ బేగ్‌కు, ఆ తర్వాత సయ్యద్‌ అబ్బాస్‌ అలీ జాఫ్రీకి చేరుతున్నట్లు తెలిసింది. వివేకానంద్‌ అబ్బాస్‌ ద్వారా కొనుగోలు చేసి పార్టీలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. రెహ్మాన్‌పై హైదరాబాద్‌లో పలు డ్రగ్స్‌ కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.

ఫిబ్రవరిలోనే పదిసార్లు కొనుగోలు

వివేకానంద్‌ ఒక్క ఫిబ్రవరిలోనే పదిసార్లు డ్రగ్స్‌ కొనుగోలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఇందుకు సంబంధించి నగదు లావాదేవీలు ఇతర చెల్లింపుల రికార్డుల్ని గుర్తించారు. అబ్బాస్‌ నుంచి ఫిబ్రవరి 16, 17 తేదీల్లో 2 గ్రాములు చొప్పున, 18, 19 తేదీల్లో ఒక గ్రాము చొప్పున కొన్నట్లు వెలుగులోకి వచ్చింది. వీటినే 24న నిర్వహించిన పార్టీలో తన స్నేహితులతో కలిసి వినియోగించినట్లు వెల్లడైంది. అతడి ఫోన్‌ కాల్స్‌, వాట్సప్‌ చాటింగులు, నగదు లావాదేవీల వివరాలను తనిఖీ చేస్తున్నారు. ఈ పార్టీలకు ప్రస్తుత ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న వారే కాకుండా.. ఇంకా ఎవరైనా వస్తున్నారా అనే కోణంలో ఆరా తీస్తున్నారు.

చేతులు మారుతోందిలా..

వివేకానంద్‌కు డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న అబ్బాస్‌కు.. యాకుత్‌పురకు చెందిన మీర్జా వహీద్‌ బేగ్‌ ద్వారా అందుతున్నట్లు తేలింది. మీర్జా వహీద్‌కు రాణిగంజ్‌కు చెందిన అబ్దుల్‌ రెహ్మాన్‌ ఓ స్నేహితుడి ద్వారా పరిచయమయ్యాడు. స్నాప్‌చాట్‌ ద్వారా అతనితో చాటింగ్‌ చేసేవాడు. ఆ పరిచయంతో రెహ్మాన్‌ నుంచి కొకైన్‌ కొనుగోలు చేయడం మొదలుపెట్టాడు. సరిగ్గా ఏడాది క్రితం మీర్జా వహీద్‌తో సయ్యద్‌ అబ్బాస్‌ అలీ జాఫ్రీకి పరిచయం ఏర్పడింది. అనంతరం అతని నుంచి డ్రగ్స్‌ తీసుకొని వివేకానంద్‌కు ఇచ్చేవాడు. ఒక్కో గ్రాము రూ.14 వేలకు అమ్మేవాడు. తాజాగా రెహ్మాన్‌ పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తే మరిన్ని లింకులు బయటపడతాయని పోలీసులు చెబుతున్నారు. మీర్జా వహీద్‌ను కూడా కస్టడీకి తీసుకుని విచారిస్తామని వెల్లడించారు.


క్రిష్‌, రఘుచరణ్‌లకు నెగెటివ్‌

కేసులో నిందితులుగా ఉన్న సినీ దర్శకుడు క్రిష్‌, రఘుచరణ్‌ మూత్ర నమూనాలను విశ్లేషించగా ఫలితాలు నెగెటివ్‌(డ్రగ్స్‌ తీసుకోనట్లు)గా వచ్చినట్లు పోలీసులు తెలిపారు. రక్త నమూనాల ఫలితాలు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. స్నేహితుడైన రఘుచరణ్‌ ఆహ్వానం మేరకు రాడిసన్‌ హోటల్‌ వెళ్లానని, అక్కడ అరగంట మాత్రమే ఉన్నానని, డ్రగ్స్‌ తీసుకోలేదని క్రిష్‌ పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితులు సందీప్‌, లిషి, శ్వేతల కోసం గాలింపు కొనసాగుతోంది. మరో నిందితుడు నీల్‌ అమెరికా పారిపోయాడని, అతనికి ఆ దేశ పౌరసత్వం ఉందని సమాచారం. అతనిపై లుకౌట్‌ నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసు నోటీసుల నేపథ్యంలో శ్వేత తల్లి గచ్చిబౌలి పోలీసుల్ని కలిశారు. తన కూతురు ఇంట్లో లేదని, రాగానే విచారణకు తీసుకొస్తానని సమాధానమిచ్చారు. మరోవైపు రాడిసన్‌ హోటల్‌ నిర్వాహకులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతానికి హోటల్‌ ఎవరు నిర్వహిస్తున్నారో స్పష్టత రాకపోవడంతో నోటీసులిచ్చామని, తేలిన తరువాత కేసు నమోదు చేస్తామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని