సీఎంఆర్‌ఎఫ్‌ సొమ్ము రూ.10.50 లక్షలు స్వాహా

బాధితులకు అందాల్సిన ముఖ్యమంత్రి సహాయనిధి(సీఎంఆర్‌ఎఫ్‌) చెక్కుల సొమ్ము రూ.10.50 లక్షలను కాజేసిన నలుగుర్ని జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు.

Published : 28 Mar 2024 03:22 IST

నలుగురి అరెస్టు

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: బాధితులకు అందాల్సిన ముఖ్యమంత్రి సహాయనిధి(సీఎంఆర్‌ఎఫ్‌) చెక్కుల సొమ్ము రూ.10.50 లక్షలను కాజేసిన నలుగుర్ని జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో మాజీ మంత్రి హరీశ్‌రావు కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేసిన నరేశ్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు దగ్గర సహాయకుడిగా పనిచేసిన కొర్లపాటి వంశీ, అసెంబ్లీలో అటెండర్‌గా పనిచేసే బాలగోని వెంకటేశ్‌, గోదావరిఖనికి చెందిన పులిపాక ఓంకార్‌ ఉన్నారు. పోలీసుల సమాచారం ప్రకారం.. మెదక్‌ జిల్లా పీర్లతండాకు చెందిన పి.రవినాయక్‌ తన భార్య చికిత్స ఖర్చుల కోసం జనవరి 2023లో హరీశ్‌రావు క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నారు. నెలలు గడిచినా సాయం అందకపోవడంతో ఆయన సచివాలయానికి వెళ్లి ఆరా తీశారు. రూ.50 వేలు, రూ.37,500ల చొప్పున రెండు చెక్కులు మంజూరైనట్లు తెలుసుకున్నారు. వాటిని నరేశ్‌కుమార్‌కు అప్పగించినట్లు తెలుసుకొని.. అతడ్ని పలుమార్లు కలిసినా స్పందనలేదు. నరేశ్‌.. ఆ చెక్కుల్ని వెంకటేశ్‌, కొర్లపాటి వంశీ, ఓంకార్‌లతో కలిసి జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబరు 5లోని ఎస్‌బీఐ నుంచి డ్రా చేసినట్లు గుర్తించారు. ఈ నెల 21న రవినాయక్‌ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి నరేశ్‌కుమార్‌, వెంకటేశ్‌, వంశీ, ఓంకార్‌లను అరెస్టు చేసినట్లు జూబ్లీహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. శాసనసభ ఎన్నికల కోడ్‌ సమయానికి హరీశ్‌రావు కార్యాలయానికి దాదాపు 250కుపైగా సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు వచ్చాయి. వీటిని తిరిగి సీఎంఆర్‌ఎఫ్‌ కార్యాలయంలోనే అప్పగించాలని హరీశ్‌రావు సూచించినా.. నరేశ్‌కుమార్‌ పట్టించుకోలేదని పోలీసులు గుర్తించారు. 19 చెక్కులు డ్రా చేసుకొని.. సుమారు 200 చెక్కులు దహనం చేసినట్లు విచారణలో తేలింది. చెక్కులు తీసుకోవడానికి ముందుకు రాని వారిని లక్ష్యంగా చేసుకుని.. అదే పేర్లతో ఉండే నకిలీ వ్యక్తులను బ్యాంకులకు తీసుకెళ్లి నిందితులు మోసానికి పాల్పడ్డట్లు తెలుస్తోంది.

నరేశ్‌తో మాకు సంబంధం లేదు: హరీశ్‌రావు కార్యాలయం

నరేశ్‌కుమార్‌ అనే వ్యక్తితో తమకు ఎలాంటి సంబంధం లేదని హరీశ్‌రావు కార్యాలయం బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ‘‘మంత్రిగా హరీశ్‌రావు పదవీకాలం పూర్తయిన తర్వాత నరేశ్‌ ఎలాంటి సమాచారం లేకుండా కొన్ని సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల్ని తీసుకెళ్లినట్లు తెలిసింది. నరేశ్‌ మీద డిసెంబరు 17న నార్సింగి ఠాణాలో ఫిర్యాదు చేశాం. నరేశ్‌తో హరీశ్‌రావుకు, ఆయన కార్యాలయానికి ఎలాంటి సంబంధం లేదు’’ అని మాజీ మంత్రి కార్యాలయం తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని