రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు

పర్యాటక ప్రాంతాల్లో హోటళ్లు, రిసార్టులకు రేటింగ్‌ ఇస్తే మంచి కమీషన్‌ ముట్టజెబుతామని భారీ మోసానికి పాల్పడిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు దేశవ్యాప్తంగా 580 బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.32.34 కోట్ల నగదును జప్తు చేశారు.

Updated : 29 Mar 2024 06:46 IST

మొత్తం రూ.524 కోట్లు స్వాహా చేసినట్లు ఈడీ అంచనా

ఈనాడు, హైదరాబాద్‌: పర్యాటక ప్రాంతాల్లో హోటళ్లు, రిసార్టులకు రేటింగ్‌ ఇస్తే మంచి కమీషన్‌ ముట్టజెబుతామని భారీ మోసానికి పాల్పడిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు దేశవ్యాప్తంగా 580 బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.32.34 కోట్ల నగదును జప్తు చేశారు. ఈ మేరకు ఈడీ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. కమీషన్‌ పేరిట తమను మోసం చేశారంటూ పలువురు నిరుద్యోగులు ఇచ్చిన ఫిర్యాదుతో హైదరాబాద్‌ సైబర్‌క్రైం పోలీసులు గతంలో కేసు నమోదు చేశారు. దీని ఆధారంగా ఈడీ అధికారులు మరో కేసు నమోదు చేశారు. ఇదే తరహా మోసం దేశవ్యాప్తంగా జరిగిందని, దాదాపు 50 కేసులు నమోదైనట్లు గుర్తించారు. దాదాపు రూ.524 కోట్ల మోసం జరిగి ఉండవచ్చని ఈడీ అంచనా వేసింది. దర్యాప్తులో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి.

లింకులు పంపి.. ఉచ్చులోకి దింపి

సైబర్‌ నేరగాళ్లు వాట్సప్‌, టెలిగ్రాంల వంటి యాప్‌ల ద్వారా ఉపాధి పేరిట నిరుద్యోగులకు గాలం వేసేవారు. రేటింగ్‌ ఇవ్వడం ద్వారా రోజుకు రూ.వెయ్యి నుంచి రూ.1500 వరకు ఆదాయం పొందవచ్చని పేర్కొనేవారు. స్పందించినవారికి లింకులు పంపేవారు. అందులో బ్యాంకు సహా వ్యక్తిగత వివరాలన్నీ నమోదు చేయాల్సి ఉంటుంది. నమ్మకం కలిగించేందుకు కమీషన్‌ కింద ఖాతాల్లో కొంత డబ్బు జమచేసేవారు. ఉచ్చులో పడ్డ తర్వాత ఆదాయం పొందాలంటే కొంత డబ్బు డిపాజిట్‌ చేయాలని నిబంధన పెట్టేవారు. ప్రత్యేక వ్యాలెట్‌లు ఏర్పాటు చేసేవారు. రేటింగులు ఇస్తున్న కొద్దీ డబ్బు ఈ వ్యాలెట్‌లో జమయ్యేది. ఉపసంహరించుకునేందుకు వీలుండేది కాదు. అడిగితే ప్రాసెసింగ్‌ ఫీజుల కింద మరికొంత జమ చేయించుకునేవారు. ఆ తర్వాత జవాబు చెప్పడం మానేయడంతోపాటు వీరి వ్యాలెట్‌లో ఉన్న డబ్బు కూడా మాయమయ్యేది. ఈ కుంభకోణానికి సూత్రధారి యూఏఈలో ఉన్నట్లు ఈడీ గుర్తించింది. తప్పుడు పత్రాలతో బ్యాంకు ఖాతాలు తెరిచారని, డబ్బు జమ అయిన తర్వాత కొన్ని ఖాతాలు ఒక్క రోజులో, మరికొన్నింటిని 15 రోజుల లోపే మూసివేశారని తేల్చారు. ఇలా తొలుత 175 ఖాతాల్లోకి జమైన నగదును 480 ఖాతాల్లోకి మళ్లించి, అక్కడ నుంచి క్రిప్టో కరెన్సీగా మార్చడంతోపాటు హవాలా రూపంలో తరలించారని ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. విదేశాలకు తరలించగా మిగిలిన డబ్బును ఈడీ ప్రాథమిక జప్తు చేసింది. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.


రుణం దారిమళ్లించిన కేసులో రూ.70 లక్షల జప్తు

వ్యాపారం కోసం రుణం తీసుకొని సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్న కేసులో హైదరాబాద్‌ ఈడీ అధికారులు రూ.70 లక్షలను జప్తు చేశారు. జస్లీన్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అనే సంస్థ యూనియన్‌ బ్యాంక్‌ నుంచి రూ.12 కోట్ల రుణం తీసుకుంది. ఈ డబ్బును సోదర సంస్థలతోపాటు వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్లించింది. దీనిపై తొలుత సీబీఐ, అనంతరం ఈడీ కేసులు నమోదు చేశాయి. జస్లీన్‌ ఎంటర్‌ప్రైజెస్‌ భాగస్వామి, అమ్రిక్‌ ఫర్నిచర్స్‌ లిమిటెడ్‌ ఎండీ రణ్‌బీర్‌సింగ్‌ గాంధీ దీనికి బాధ్యుడిగా సీబీఐ దర్యాప్తులో వెల్లడైంది. రుణం కూడా తప్పుడు ధ్రువపత్రాలు పెట్టి తీసుకున్నట్లు తేలింది. రణ్‌బీర్‌సింగ్‌ తన బంధువులు, మిత్రుల పేర్లతో సంస్థలు ఏర్పాటు చేయించి రుణం ద్వారా పొందిన డబ్బు వారి ఖాతాల్లోకి, తన భార్య ఖాతాలోకి మళ్లించినట్లు కూడా గుర్తించారు. తదనంతరం జరిగిన పరిణామాల్లో రణ్‌బీర్‌సింగ్‌ యూనియన్‌ బ్యాంక్‌కు వన్‌టైం సెటిల్‌మెంట్‌ కింద రూ.11.30 కోట్లు చెల్లించాడు. నిధుల మళ్లింపు కోణంలో దర్యాప్తు జరుపుతున్న ఈడీ ఆయా ఖాతాల్లో మిగిలి ఉన్న రూ.70 లక్షలను బ్యాంకుకు వచ్చిన నష్టంగానే పరిగణించి ఈ మొత్తాన్ని జప్తు చేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని