రెచ్చిపోయిన ఇసుక మాఫియా

వైకాపా నాయకుల కనుసన్నల్లో సాగుతున్న ఇసుక మాఫియా అక్రమాలకు అంతే లేకుండా పోయింది. విచ్చలవిడిగా సాగుతున్న అక్రమ తవ్వకాల వల్ల బోర్లు ఎండిపోతున్నాయంటూ అడ్డు చెప్పిన గ్రామస్థులపై వైకాపా కార్యకర్తలు ఇనుప రాడ్లతో విచక్షణా రహితంగా దాడిచేసి గాయపరిచారు.

Updated : 30 Mar 2024 06:30 IST

తవ్వకాలు వద్దన్నందుకు ఇనుప రాడ్లతో దాడి
గ్రామస్థులపై ట్రాక్టర్‌ ఎక్కించి హతమార్చేందుకు యత్నం
ద్విచక్ర వాహనాల ధ్వంసం
మున్నంగి రీచ్‌లో వైకాపా కార్యకర్తల అరాచకం

ఈనాడు-అమరావతి, న్యూస్‌టుడే-కొల్లిపర: వైకాపా నాయకుల కనుసన్నల్లో సాగుతున్న ఇసుక మాఫియా అక్రమాలకు అంతే లేకుండా పోయింది. విచ్చలవిడిగా సాగుతున్న అక్రమ తవ్వకాల వల్ల బోర్లు ఎండిపోతున్నాయంటూ అడ్డు చెప్పిన గ్రామస్థులపై వైకాపా కార్యకర్తలు ఇనుప రాడ్లతో విచక్షణా రహితంగా దాడిచేసి గాయపరిచారు. అంతటితో ఆగకుండా వారిపై ట్రాక్టర్‌ ఎక్కించి హతమార్చేందుకు యత్నించారు. గ్రామస్థుల  ద్విచక్ర వాహనాలను సైతం ట్రాక్టరుతో తొక్కించి ధ్వంసం చేశారు. కరకట్టపై కొద్దిసేపు భయానక వాతావరణం సృష్టించారు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం మున్నంగి రీచ్‌లో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. దీనివెనుక స్థానికంగా ఇసుక మాఫియా నడిపిస్తున్న ముఖ్య నాయకుడి ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. మున్నంగి రీచ్‌లో కొన్నాళ్లుగా ఇసుక అక్రమ తవ్వకాలు చేపడుతున్నారు.

దీంతో భూగర్భ జలాలు అడుగంటి, బోరుబావులు ఎండిపోతున్నాయని గ్రామస్థులు ఆందోళన చెందుతూ ఇసుక తవ్వకాలను అడ్డుకోవాలని నిర్ణయించుకున్నారు. అదే గ్రామానికి చెందిన వైకాపా కార్యకర్తలు ట్రాక్టర్లలో శుక్రవారం సాయంత్రం ఇసుకను తరలిస్తుండడంతో అడ్డుకున్నారు. దీంతో వారు రాడ్లు, కర్రలతో దాడి చేశారు. గ్రామస్థుల ద్విచక్ర వాహనాలను ట్రాక్టర్‌తో ఢీకొట్టి ధ్వంసం చేశారు. దాడిలో మున్నంగికి చెందిన వేమూరి బాలరాజు, వేమూరి అశోక్‌, కొండూరి మహేష్‌, వేమూరి మహేష్‌, మోజేషు తదితరులకు గాయాలయ్యాయి. దాడికి పాల్పడిన వారితోపాటు బాధితులను సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కొన్నాళ్లుగా ఇసుక అక్రమ తవ్వకాలను ఆపాలని గ్రామస్థులు కోరుతున్నా, అధికార యంత్రాంగం నుంచి కనీస స్పందన కరవైంది. దీంతో గ్రామస్థులే జోక్యం చేసుకుని అడ్డుకోగా వారిపై ఇసుక మాఫియా దాడి చేయడం గమనార్హం. దాడికి పాల్పడిన వారిలో స్థానికులు వేమూరి మోసయ్య, ఆయన కుమారుడు చింతయ్య ఉన్నట్లు బాధితులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని