తెదేపా ఎంపీటీసీ సభ్యుడిపై దాడి

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలో తెదేపా ఎంపీటీసీ సభ్యుడిపై గ్రామ వాలంటీర్‌ సహా నలుగురు యువకులు దాడికి పాల్పడ్డారు.

Published : 01 Apr 2024 08:47 IST

వాలంటీరు సహా నలుగురు యువకుల దాష్టీకం
మద్యం మత్తులో నడిరోడ్డుపై వీరంగం

కుప్పం, న్యూస్‌టుడే: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలో తెదేపా ఎంపీటీసీ సభ్యుడిపై గ్రామ వాలంటీర్‌ సహా నలుగురు యువకులు దాడికి పాల్పడ్డారు. శనివారం అర్ధరాత్రి జరిగిన ఘటనపై బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. సి.బండపల్లె ఎంపీటీసీ సభ్యుడు నామాలప్ప శాంతిపురంలో ఓ వివాహానికి హాజరై కారులో స్వగ్రామానికి వెళుతుండగా మండల పరిధి రాళ్లబూదుగూరు వద్ద రోడ్డుపై మద్యం తాగుతున్న నలుగురు యువకులు అడ్డుకున్నారు. మద్యం మత్తులో వీరంగం చేస్తూ కారులో నుంచి నామాలప్పను కిందకు లాగి దాడి చేశారు. తీవ్రంగా కొట్టడంతో  యువకుల కాళ్లు పట్టుకుంటానని బాధితుడు ప్రాధేయపడినా ముఖంపై పిడిగుద్దులతో తీవ్రంగా గాయపరిచారు.

అతని మెడలోని బంగారుగొలుసు, సెల్‌ఫోనును లాక్కున్నారు. కారు అద్దాలు ధ్వంసం చేశారు. యువకుల నుంచి తప్పించుకున్న నామాలప్ప పరుగులు తీస్తూ రాళ్లబూదుగూరు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని దాడి విషయాన్ని తెలియజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. గ్రామ వాలంటీర్‌ దిలీప్‌తోపాటు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. కుప్పం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నామాలప్పను తెదేపా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌, నియోజకవర్గ పార్టీ విస్తరణ విభాగం కన్వీనర్‌ డాక్టర్‌ బీఆర్‌ సురేష్‌బాబు, పార్టీ ఇన్‌ఛార్జి మునిరత్నం తదితరులు ఆదివారం పరామర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని