కుమురం భీం జిల్లాలో ఏనుగు దాడి.. రైతు మృతి

కుమురం భీం జిల్లాలో పొలం పనులు చేసుకుంటున్న ఓ రైతుపై అకస్మాత్తుగా ఏనుగు దాడి చేయడంతో అతను ప్రాణాలు విడిచారు. చింతలమానెపల్లి మండలం భూరెపెళ్లి గ్రామంలో బుధవారం ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది.

Published : 04 Apr 2024 05:38 IST

చింతలమానెపల్లి, న్యూస్‌టుడే: కుమురం భీం జిల్లాలో పొలం పనులు చేసుకుంటున్న ఓ రైతుపై అకస్మాత్తుగా ఏనుగు దాడి చేయడంతో అతను ప్రాణాలు విడిచారు. చింతలమానెపల్లి మండలం భూరెపెళ్లి గ్రామంలో బుధవారం ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. స్థానికులు, సిర్పూర్‌(టి) ఎఫ్‌ఆర్‌వో పూర్ణచందర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. భూరెపెళ్లి గ్రామానికి చెందిన అల్లూరి శంకర్‌ (45) తనకున్న రెండెకరాల పొలంలో మిరప సాగు చేశారు. తన భార్యతో కలిసి పొలానికి వెళ్లిన అతను వ్యవసాయ పనులు చేసుకుంటున్న క్రమంలో సాయంత్రం ఒక్కసారిగా ఏనుగు వచ్చింది. అది వారిని సమీపిస్తుండటంతో గమనించిన శంకర్‌ భార్య అరుస్తూ పరుగులు పెట్టింది. శంకర్‌ పొలంలోనే ఉండిపోగా ఏనుగు అతనిపై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

విషయం తెలుసుకున్న గ్రామస్థులు, అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకున్నారు. జిల్లా అటవీశాఖ అధికారి నీరజ్‌ కుమార్‌ టిబ్రివాల్‌ ఘటనా స్థలానికి చేరుకుని అటవీశాఖ సిబ్బందికి పలు సూచనలు చేశారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు అయిన ప్రాణహిత నది దాటి ఏనుగు రాష్ట్రంలోకి ప్రవేశించినట్లు భావిస్తున్నారు. దాడి చేసిన అనంతరం ఏనుగు భూరెపెళ్లి శివారు నుంచి వెళ్లి.. మండలంలోని లంబడిహేటి, గంగాపూర్‌ గ్రామాల మధ్య ఉన్న ప్రాణహిత ప్రాజెక్టు కాలువ వెంబడి సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. కాగా పరిసర గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.


బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం: మంత్రి కొండా సురేఖ

ఈనాడు, హైదరాబాద్‌: ఏనుగు దాడిలో రైతు అల్లూరి శంకర్‌ మృతి చెందడం బాధాకరమని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ప్రకటించారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆ మొత్తాన్ని అందిస్తామని ఆమె బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని