కోల్‌కతాలో దొరికిన ‘రామేశ్వరం కెఫే’ నిందితులు

కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని రామేశ్వరం కెఫే బాంబు పేలుడు కేసులో ఇద్దరు కీలక నిందితులను జాతీయ విచారణ సంస్థ (ఎన్‌ఐఏ) శుక్రవారం కోల్‌కతాకు సమీపంలో అరెస్టు చేసింది.

Published : 13 Apr 2024 05:27 IST

పేలుడుకు పాల్పడిన వ్యక్తితో పాటు సూత్రధారీ అరెస్టు

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే, కోల్‌కతా: కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని రామేశ్వరం కెఫే బాంబు పేలుడు కేసులో ఇద్దరు కీలక నిందితులను జాతీయ విచారణ సంస్థ (ఎన్‌ఐఏ) శుక్రవారం కోల్‌కతాకు సమీపంలో అరెస్టు చేసింది. కెఫేలో ఐఈడీని అమర్చిన ముసావిర్‌ హుస్సేన్‌ షాజిబ్‌, బాంబు పేలుడు వెనుక సూత్రధారి అబ్దుల్‌ మథీన్‌ అహ్మద్‌ తాహాలను అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించింది. ఈ ఉగ్రవాదుల వేటలో తమకు కేంద్ర నిఘా వర్గాలతో పాటు పశ్చిమబెంగాల్‌, దిల్లీ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కేరళ పోలీసులు సహకరించారని తెలిపింది. నిందితులను కోల్‌కతాలోని ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచామని, న్యాయస్థానం మూడు రోజుల కస్టడీకి ఇచ్చిందని పేర్కొంది. గత నెల ఒకటో తేదీన బెంగళూరులోని రామేశ్వరం కెఫేలో జరిగిన ఈ పేలుడులో తొమ్మిది మంది గాయపడ్డారు. బాంబు పేల్చిన అనంతరం ముసావిర్‌ రోడ్డుమార్గంలోనే పశ్చిమ బెంగాల్‌ వరకు చేరుకున్నట్లు గుర్తించారు. వైట్ఫీల్డ్‌ నుంచి గురగుంటపాళ్య వరకు బీఎంటీసీ బస్సులో ప్రయాణించి- అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులో తుమకూరు, బళ్లారి మీదుగా ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరుకు చేరుకున్నాడు. తర్వాత నెల్లూరు నుంచి ఒడిశా మీదుగా పశ్చిమ బెంగాల్‌ వెళ్లిపోయాడు. నిందితులిద్దరినీ ఒక క్యాప్‌ పట్టించింది. దానిని కొనడానికి వెళ్లినప్పుడు సీసీటీవీలో రికార్డయిన దృశ్యాల ఆధారంగా నిందితులను  గుర్తించారు. మరోవైపు కోల్‌కతాలో జరిగిన ఈ అరెస్టులు రాజకీయరంగు పులుముకున్నాయి. ఉగ్రవాదులకు బెంగాల్‌ స్వర్గధామంగా మారిపోయిందని అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ)పై భాజపా ఆరోపణలు చేసింది. వీటిని టీఎంసీ తిప్పికొట్టింది. ‘‘రాష్ట్రం సురక్షితం కాదని భాజపా చెబుతోంది. బెంగాల్‌ పోలీసులు సత్వరం స్పందించడంతోనే సమాచారం అందిన రెండు గంటల్లోనే నిందితులు అరెస్టయ్యారు. మరి మీరు అధికారంలో ఉన్న రాష్ట్రంలో పరిస్థితేంటి’’ అని భాజపాను ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని