మావోయిస్టులకు శరాఘాతం!

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని కాంకేర్‌ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా ఉత్తర బస్తర్‌ డివిజన్‌ కమిటీ భారీ మూల్యం చెల్లించుకుంది.

Published : 18 Apr 2024 03:37 IST

ఉత్తర బస్తర్‌ డివిజన్‌ కమిటీకి భారీ ఎదురుదెబ్బ
మృతుల్లో 9 మంది గుర్తింపు
మరణించినవారిలో 15 మంది మహిళలు
శంకర్‌రావు, లలితలపై రూ.8 లక్షల చొప్పున రివార్డు

ఈనాడు-హైదరాబాద్‌, కాంకేర్‌, చర్ల-న్యూస్‌టుడే: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని కాంకేర్‌ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా ఉత్తర బస్తర్‌ డివిజన్‌ కమిటీ భారీ మూల్యం చెల్లించుకుంది. ఎన్‌కౌంటర్‌లో మరణించిన 29 మంది మృతదేహాలను కాంకేర్‌కు తరలించిన ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు.. బుధవారం రాత్రి నాటికి 9 మందిని గుర్తించారు. మృతుల్లో 15 మంది మహిళా మావోయిస్టులున్నట్లు బస్తర్‌ రేంజ్‌ ఐజీ సుందర్‌రాజ్‌ మీడియాకు తెలిపారు. డివిజనల్‌ కమిటీ సభ్యులు శంకర్‌రావు, లలితలపై రూ.8 లక్షల చొప్పున రివార్డు ఉందని చెప్పారు. ‘‘ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతం ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌, నారాయణపుర్‌, మహారాష్ట్రలోని గడ్చిరోలి ప్రాంతాల సరిహద్దులకు కూడలిగా ఉంది. ఈ డివిజన్‌ కమిటీలో 70-80 మంది మావోయిస్టులు ఉన్నారు. వేర్వేరు డివిజన్‌ కమిటీలు వేర్వేరు పనులు నిర్వహిస్తాయి. గుత్తేదారులు, ప్రజల నుంచి అక్రమంగా నగదు వసూలు చేయడం, ఇతర మావోయిస్టు కమిటీలకు వస్తువులు సరఫరా చేయడం ఉత్తర బస్తర్‌ డివిజన్‌ కమిటీ బాధ్యతలు. ఈ డివిజన్‌ కమిటీలో రావ్‌ఘాట్‌, ప్రతాప్‌పుర్‌, కువి, కిసోడో ఏరియా కమిటీలు ఉన్నాయి. మృతి చెందిన మావోయిస్టుల్లో ఎక్కువ మంది పార్థాపుర్‌ ఏరియా కమిటీకి చెందిన వారిగా గుర్తించాం’’ అని ఐజీ వివరించారు. ఉక్కపోత పరిస్థితులు, కొండ ప్రాంతాలు, తాగునీటి కొరత.. ఎన్‌కౌంటర్‌ సందర్భంగా భద్రతా బలగాలకు ఎదురైన సవాళ్లని ఛత్తీస్‌గఢ్‌లోని పఖాంజూర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో లక్ష్మణ్‌ కేవట్‌ తెలిపారు.

అష్టదిగ్బంధం.. మావోయిస్టులకు ఊహించని పరిణామం

ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతం కాంకేర్‌ జిల్లా ఛోటేబేటియా పోలీసుస్టేషన్‌ పరిధిలోని బీనాగుండా-కోరుగట్ట అటవీప్రాంతంలో ఉంది. ఆ ప్రాంతంలో మావోయిస్టులు పెద్దఎత్తున సమావేశం అయ్యారన్న పక్కా సమాచారంతో బీఎస్‌ఎఫ్‌, డీఆర్‌జీ బృందాలు అష్టదిగ్బంధం చేశాయి. ఈ బృందాల్లో సుమారు 200 మంది ఉన్నారు. ఆ సమయంలో మావోయిస్టులు భోజనాలు చేసి విరామం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ దట్టమైన అటవీ ప్రాంతానికి నదులు, కొండలు దాటి.. బీఎస్‌ఎఫ్‌, డీఆర్‌జీ బలగాలు వస్తాయని మావోయిస్టులు ఊహించనట్లు తెలుస్తోంది. అనూహ్య పరిణామంతో వారు తేరుకోలేకపోయారని తెలుస్తోంది. కాంకేర్‌ ప్రాంతంపై ఎంతో పట్టుండి.. అనేక ఘటనలకు సూత్రధారిగా భావిస్తున్న డివిజనల్‌ కమిటీ సభ్యుడు శంకర్‌రావు మృతి చెందడం మావోయిస్టు పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.


మృతి చెందిన మావోయిస్టుల్లో పోలీసులు గుర్తించినవారు వీరే..

  • శంకర్‌రావు - ఉత్తర బస్తర్‌ డివిజన్‌ మాస్‌ ఇన్‌ఛార్జి, డీవీసీ సభ్యుడు
  • రంజిత (శంకర్‌రావు భార్య) - ఉత్తర బస్తర్‌ డివిజన్‌ సభ్యురాలు
  • లలిత - డీవీసీ సభ్యురాలు, ప్రతాప్‌పుర్‌ ఏరియా కమిటీ, జనతన సర్కార్‌ కో-ఆర్డినేటర్‌ ఇన్‌ఛార్జి
  • మాధవి - ఉత్తర బస్తర్‌ డివిజన్‌ సభ్యురాలు  
  • జుగ్ని అలియాస్‌ మాల్తి - ప్రతాప్‌పుర్‌ ఏరియా కమిటీ
  • రూపి - ఫ్రాగ్‌ ఎల్‌వోఎస్‌ కమాండర్‌
  • శ్రీకాంత్‌ - ప్రతాప్‌పుర్‌ ఏరియా కమిటీ
  • రామ్‌శిల - ఉత్తర బస్తర్‌ డివిజన్‌ సభ్యురాలు
  • సుఖ్‌లాల్‌ - ప్రతాప్‌పుర్‌ ఏరియా కమిటీ

భాజపా నేత దారుణ హత్య

దుమ్ముగూడెం, న్యూస్‌టుడే: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నారాయణపుర్‌ జిల్లా దండ్వాన్‌ ఉపసర్పంచి, భాజపా నేత పంచమ్‌దాస్‌ మానిక్‌పురి(52)ను మావోయిస్టులు దారుణంగా హత్య చేశారు. మంగళవారం అర్ధరాత్రి ఆయుధాలతో ఆయన ఇంట్లోకి చొరబడిన పలువురు మావోయిస్టులు.. పదునైన ఆయుధాలతో పంచమ్‌దాస్‌ను నరికిచంపారు. అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని, పోలీస్‌ ఇన్‌ఫార్మర్‌గా మారారంటూ పలు ఆరోపణలు చేస్తూ ఘటనా స్థలంలో కరపత్రాలు వదిలివెళ్లారు. కాంకేర్‌ ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో మావోయిస్టులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసు అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని