అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలంగాణ విద్యార్థుల దుర్మరణం

అమెరికాలో శనివారం రాత్రి(భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం) జరిగిన రోడ్డు ప్రమాదం ఇద్దరు తెలంగాణ విద్యార్థులను బలిగొంది.

Published : 22 Apr 2024 06:50 IST

హుజూరాబాద్‌ పట్టణం, స్టేషన్‌ఘన్‌పూర్‌-న్యూస్‌టుడే: అమెరికాలో శనివారం రాత్రి(భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం) జరిగిన రోడ్డు ప్రమాదం ఇద్దరు తెలంగాణ విద్యార్థులను బలిగొంది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ పట్టణానికి చెందిన డాక్టర్‌ స్వాతి, డాక్టర్‌ నవీన్‌ దంపతుల కుమారుడు నివేశ్‌(20), జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలంలోని శివునిపల్లికి చెందిన స్వర్ణకారుడు పార్శి కమల్‌కుమార్‌, పద్మ దంపతుల పెద్ద కుమారుడు గౌతమ్‌కుమార్‌(19) అమెరికాలోని అరిజోనా స్టేట్‌ విశ్వవిద్యాలయంలో బీటెక్‌ రెండో సంవత్సరం చదువుతున్నారు. శనివారం రాత్రి ఈ ఇద్దరు తమ మిత్రులతో కలిసి విశ్వవిద్యాలయం నుంచి ఇంటికి కారులో వస్తుండగా వెనక నుంచి వేగంగా వచ్చిన ఓ గుర్తు తెలియని వాహనం వీరి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెనక సీట్లో కూర్చున్న నివేశ్‌, గౌతమ్‌ కుమార్‌ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు అక్కడి పోలీసులు ఆదివారం మధ్యాహ్నం మృతుల తల్లిదండ్రులకు సమాచారం అందించారు. గౌతమ్‌కుమార్‌ మృతదేహం స్వగ్రామం చేరుకోవడానికి రెండు మూడు రోజుల సమయం పడుతుందని మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు. నివేశ్‌ మృతదేహాన్ని హుజూరాబాద్‌కు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని