గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌ మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్‌ బేస్‌ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్‌ కమాండెంట్‌ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు.

Published : 25 Apr 2024 03:11 IST

పూసుగుప్ప బేస్‌ క్యాంపు పరిధిలో ఘటన

చర్ల, న్యూస్‌టుడే: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్‌ బేస్‌ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్‌ కమాండెంట్‌ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. చర్ల మండల కేంద్రానికి 18 కి.మీ. దూరంలోని తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు పూసుగుప్ప బేస్‌ క్యాంపు నుంచి సమీప అడవుల్లోకి ఎప్పటిలానే సీఆర్పీఎఫ్‌ 81 బెటాలియన్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌ ఎం.వి.శేషగిరి(47) నేతృత్వంలోని బృందం కూంబింగ్‌కు వెళ్లింది. కూంబింగ్‌ అనంతరం అడవిలో తిరిగి వస్తున్న క్రమంలో శేషగిరి కాలుజారి చిన్న గుంటలో పడిపోయారు. ఈ క్రమంలో ఆయన చేతిలో ఉన్న ఏకే-47 (లోడ్‌లో ఉండగా) తుపాకి ప్రమాదవశాత్తూ పేలడంతో ఆయన ఛాతి కింద భాగంలోకి బుల్లెట్‌ దూసుకుపోయింది. గాయపడిన ఆయనను వెంటనే సమీప బేస్‌ క్యాంపునకు చేర్చి, సీఐ రాజవర్మకు సమాచారం అందించి అక్కడి నుంచి 108 వాహనంలో 73 కి.మీ. దూరంలోని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో మార్గం మధ్యలోనే శేషగిరి మృతి చెందారు. భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో ఉన్న శేషగిరి మృత దేహానికి జిల్లా ఎస్పీ రోహిత్‌రాజు, ఓఎస్డీ సాయి మనోహర్‌, ఏఎస్పీ పరితోష్‌ పంకజ్‌, సీఆర్పీఎఫ్‌ అధికారులు నివాళులర్పించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీఐ రాజవర్మ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాకు చెందిన శేషగిరి కుటుంబం ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటోంది. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని