హోమియోపతి మందులతో నకిలీ మద్యం తయారీ

విశాఖ నగరంలో నకిలీ మద్యం తయారు చేస్తున్న ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి మద్యం తయారీకి వాడుతున్న రసాయనాలు, లేబుళ్లు, సీసాలను స్వాధీనం చేసుకున్నారు.

Updated : 03 May 2024 06:45 IST

నిందితుల్ని పట్టుకున్న పోలీసులు
మద్యం సీసాలు, రసాయనాల స్వాధీనం

విశాఖపట్నం (ఎంవీపీకాలనీ, జగదాంబకూడలి), న్యూస్‌టుడే: విశాఖ నగరంలో నకిలీ మద్యం తయారు చేస్తున్న ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి మద్యం తయారీకి వాడుతున్న రసాయనాలు, లేబుళ్లు, సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉదంతానికి సంబంధించిన వివరాల్ని విశాఖ పోలీసు కమిషనర్‌ రవిశంకర్‌ వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం... పాత నేరస్థుడైన సుశాంత్‌ పాత్రో కొన్ని రోజులుగా పోలీసులకు కనిపించక పోవడంతో అతని కదలికలపై నిఘా పెట్టారు. అతను శిరీష అనే మహిళతో కలిసి విజయనగరం జిల్లా కొత్తవలస సమీపంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని కల్తీ మద్యం తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఓ రకం హోమియోపతి మందులో 90 శాతం ఆల్కహాలు ఉంటుంది. సుశాంత్‌ దీనికి రంగుల్ని జోడించి, కల్తీ మద్యం తయారు చేస్తున్నాడు. కొన్ని బ్రాండ్‌ల సీసాల్ని సేకరించి వాటిలో నకిలీ మద్యం పోసి... బెల్టు షాపులు, కిరాణా దుకాణాల్లో తక్కువ ధరకు అమ్ముతున్నాడు. ముడిసరకును ఒడిశా నుంచి దిగుమతి చేసుకుంటున్నాడు. నిందితుల నుంచి హోమియోపతి మందులు, రంగులు, 5,625 లీటర్ల నకిలీ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఎన్నికల వేళ కలకలం..

సార్వత్రిక ఎన్నికల సమయంలో నకిలీ మద్యం వ్యవహారం కలకలం సృష్టించింది. ఈ నకిలీ మద్యాన్ని తాగితే ప్రమాదమని సాక్షాత్తూ పోలీసులే చెబుతున్నారు. అయితే ఇప్పటికే అనకాపల్లి జిల్లా పరవాడ, సబ్బవరం పరిసర ప్రాంతాల్లో ఈ నకిలీ మద్యం విక్రయం ఆందోళన కలిగిస్తోంది. ఆయా ప్రాంతాల్లో బెల్టుషాపుల ద్వారా ఈ మద్యాన్ని ఇప్పటికే ఎక్కువ మందికి విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇద్దర్ని మాత్రమే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తయారీ, మార్కెటింగ్‌, సరఫరా లాంటి అంశాలపై ఆరాతీస్తే ఎక్కువ మంది వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ మద్యం తాగిన వారు ఎంతమంది ఉంటారో గుర్తించి వారికి ఆరోగ్య పరంగా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని