మానవ అక్రమ రవాణా.. ఆపై సైబర్‌ నేరాలు

విదేశాల్లో ఉద్యోగాలు.. లక్షల్లో సంపాదన అని నమ్మించి కాంబోడియాకు మనుషులను విక్రయిస్తున్న ఓ ముఠాను విశాఖ పోలీసులు పట్టుకున్నారు. ఓ బాధితుడు తప్పించుకుని పోలీసులకు ఇచ్చిన సమాచారంతో కొందరు నిందితులను పోలీసులు పట్టుకున్నారు.

Published : 19 May 2024 06:05 IST

విదేశాల్లో ఉద్యోగాలంటూ నిరుద్యోగులకు వల
వారితో సైబర్‌ నేరాలు చేయించిన చైనా కంపెనీలు
ముగ్గురు ఏజెంట్లను అరెస్టు చేసిన విశాఖ పోలీసులు

సైబర్‌ మోసాల వివరాలను వివరిస్తున్న సీపీ రవిశంకర్‌

విశాఖపట్నం (ఎంవీపీ కాలనీ), న్యూస్‌టుడే: విదేశాల్లో ఉద్యోగాలు.. లక్షల్లో సంపాదన అని నమ్మించి కాంబోడియాకు మనుషులను విక్రయిస్తున్న ఓ ముఠాను విశాఖ పోలీసులు పట్టుకున్నారు. ఓ బాధితుడు తప్పించుకుని పోలీసులకు ఇచ్చిన సమాచారంతో కొందరు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. ఈ అక్రమ రవాణాను విదేశాంగశాఖ దృష్టికి తీసుకెళ్తామని విశాఖ పోలీసు కమిషనర్‌ రవిశంకర్‌ వెల్లడించారు. శనివారం సాయంత్రం ఆయన విలేకర్లకు ఈ వివరాలు వెల్లడించారు.

‘‘విశాఖ గాజువాకకు చెందిన కన్సల్టెంట్‌ చుక్క రాజేష్‌ (33) ఇంజినీరింగ్‌ చదివి కొంతకాలం గల్ఫ్‌లో ఫైర్‌ అండ్‌ సేఫ్టీ మేనేజర్‌గా పనిచేశాడు. ఆ అనుభవంతో ఫైర్‌ సేఫ్టీ చదివినవారిని విదేశాలకు పంపేవాడు. ఆ విషయం తెలిసిన సంతోష్‌ 2023 మార్చిలో రాజేష్‌ను కలిశాడు. కాంబోడియాలో ఉద్యోగాలున్నాయని.. ఒక్కో వ్యక్తి నుంచి రూ.90వేలు తీసుకుని తాను చెప్పిన వ్యక్తికి రూ.70వేలు ఇచ్చి మిగతా రూ.20వేలు నువ్వు తీసుకోవాలని రాజేష్‌కు సంతోష్‌ సలహా ఇచ్చాడు. అలా వెళ్లేవారితో సైబర్‌ నేరాలు చేయిస్తామని.. ఆ విషయం వారికి చెప్పకూడదని కోరాడు. ఇద్దరి మధ్య అవగాహనతో రాజేష్‌ 27 మందిని కాంబోడియా పంపించాడు. తర్వాత రాజేష్‌కు ఆర్య, హబీబ్‌ అనే మరో ఇద్దరు ఏజెంట్లు పరిచయమయ్యారు. వారు ఇంకా ఎక్కువ కమీషన్‌ ఇస్తామనడంతో ఒక్కొక్కరి వద్ద రూ.1.50 లక్షలు తీసుకుని 150 మందిని రాజేష్‌ కాంబోడియా పంపించాడు. ఇలా వెళ్లినవారిని అక్కడి ఏజెంట్లు కాంబోడియా కంపెనీలకు 2500 నుంచి 4 వేల అమెరికన్‌ డాలర్లకు విక్రయించేవారు.

తర్వాత వీరిని చైనా కంపెనీ ప్రతినిధులు అదుపులోకి తీసుకుని బలవంతంగా సైబర్‌ మోసాలు చేయించేవారు. సంపాదించిన డబ్బులో 1% వీరికి ఇచ్చి, కంపెనీలు 99% తీసుకునేవి. వీరిని వ్యసనాలకు బానిసలు చేసేవారు. వీరినుంచి తప్పించుకుని విశాఖకు చెందిన ఓ బాధితుడు 1930కు ఫిర్యాదు చేశాడు. దీంతో ఉన్నతాధికారుల పర్యవేక్షణలో సైబర్‌ సీఐ భవానీప్రసాద్‌ విచారణ జరిపి ముఖ్య ఏజెంటు రాజేష్, కొండలరావు, జ్ఞానేశ్వరరావు అనే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నాం. గత రెండేళ్లుగా విశాఖ, శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, తుని, కోల్‌కతాల నుంచి కాంబోడియాకు సుమారు 5వేల మందిని పంపారు. గత రెండేళ్లలో రూ.100 కోట్ల మేర సైబర్‌ నేరాలకు వీరు పాల్పడ్డారు. ఈ అక్రమ రవాణా వ్యవహారాన్ని కాంబోడియాలోని భారతీయ ఎంబసీ దృష్టికి తీసుకెళ్తాం’’ అని సీపీ రవిశంకర్‌ తెలిపారు. విలేకరుల సమావేశంలో ఎస్‌బీ ఏడీసీపీ వెంకటరావు, ట్రాఫిక్‌ ఏడీసీపీ శ్రీనివాసరావు, ఏసీపీ రాజీవ్‌కుమార్, సీఐ భవానీప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని