రిజిస్ట్రేషన్‌ చేసేందుకు రూ.5 వేలు.. బిల్లు మంజూరుకు రూ.7 వేలు లంచం..!

హనుమకొండ జిల్లా కమలాపూర్‌ తహసీల్దారు కార్యాలయంలో ధరణి ఆపరేటర్‌ రాకేశ్‌ రూ.5 వేలు లంచం తీసుకుంటూ సోమవారం అవినీతి నిరోధక శాఖ(అనిశా) అధికారులకు చిక్కాడు.

Published : 21 May 2024 05:15 IST

అనిశాకు పట్టుబడిన తహసీల్దారు, ధరణి ఆపరేటర్‌.. పీఆర్‌ సీనియర్‌ అసిస్టెంట్‌
హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో, సిరిసిల్ల కలెక్టరేట్‌లో ఘటనలు

ధరణి ఆపరేటర్‌ రాకేశ్, తహసీల్దారు మాధవి

కమలాపూర్, సిరిసిల్ల గ్రామీణం, న్యూస్‌టుడే: హనుమకొండ జిల్లా కమలాపూర్‌ తహసీల్దారు కార్యాలయంలో ధరణి ఆపరేటర్‌ రాకేశ్‌ రూ.5 వేలు లంచం తీసుకుంటూ సోమవారం అవినీతి నిరోధక శాఖ(అనిశా) అధికారులకు చిక్కాడు. ఇందులో తహసీల్దారు పి.మాధవికి రూ.4 వేలు వాటా ఉన్నట్లు తమ విచారణలో తేలడంతో ఇద్దరినీ అరెస్టు చేసి వరంగల్‌ అనిశా కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. ఈ నెల 9న కన్నూరు గ్రామ పరిధి రాములపల్లెకు చెందిన రైతు కసరబోయిన గోపాల్‌ తన తండ్రి రాజయ్య పేరిట ఉన్న మూడెకరాల రెండు గుంటల వ్యవసాయ భూమిని గిఫ్ట్‌ డీడ్‌ రిజిస్ట్రేషన్‌ చేయడానికి మీసేవలో ధరణి స్లాట్ బుక్‌ చేసుకున్నారు. 10న తన తల్లిదండ్రులు, కుటుంబీకులతో కలిసి రిజిస్ట్రేషన్‌కు రాగా స్లాట్ దస్త్రం చూడకుండానే తర్వాత రావాలని తహసీల్దారు సూచించారు. తిరిగి 18న కార్యాలయానికి వెళ్లగా రూ.6 వేలు ఇస్తేనే పని చేస్తామని డిమాండ్‌ చేశారు. దీంతో ఆయన హనుమకొండలోని అనిశా అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారు వల పన్ని కార్యాలయంలో ఆపరేటర్‌ రాకేశ్‌ గోపాల్‌ నుంచి రూ.5 వేలు తీసుకుంటుండగా పట్టుకున్నారు. కాగా అధికారులను అనిశాకు పట్టించిన గోపాల్‌ను మరిపల్లి, గుండేడు గ్రామాల రైతులు తహసీల్దారు కార్యాలయం ఆవరణలోనే సన్మానించారు.

పీఆర్‌ సీనియర్‌ అసిస్టెంట్‌ భాస్కర్‌రావు

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలోని పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో సోమవారం సీనియర్‌ అసిస్టెంట్‌ జోగినిపల్లి భాస్కర్‌రావు రూ.7 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్లు అనిశా డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. గంభీరావుపేట మండలం లింగన్నపేటకు చెందిన గుత్తేదారు గొల్లెని వెంకటేశ్‌ తన స్వగ్రామంలో 2021లో మైనార్టీ సంక్షేమ నిధులు రూ.4.30 లక్షలతో శ్మశాన వాటిక ప్రహరీ నిర్మించారు. సంబంధిత బిల్లు కోసం భాస్కర్‌రావును సంప్రదించగా.. 4 నెలలపాటు రేపుమాపంటూ తిప్పుకొన్నారు. చివరకు బిల్లు మంజూరు కావాలంటే రూ.8 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీంతో బాధితుడు అనిశా అధికారులను సంప్రదించగా... వారు వల పన్ని గుత్తేదారు నుంచి భాస్కర్‌రావు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. నిందితుడిని కరీంనగర్‌లోని అనిశా ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని